సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ లా డిగ్రీ ఉపయోగిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఇబ్బందికరంగా మారింది. ఆయనను మంత్రిమండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఆప్‌పై వ్యతిరేక నినాదాలు రాసినప్లకార్డులను ధరించి బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ నేతృత్వం వహించారు. తప్పు చేస్తూ పట్టుబడిన ఏ వ్యక్తినైనా పార్టీనుంచి తొలగిస్తామని ప్రకటించిన కేజ్రీవాల్ ఇప్పుడు తోమర్‌ను ఎందుకు తొలగించడం లేదని ఉపాధ్యాయ ప్రశ్నించారు. ఢిల్లీ సర్కార్ ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. నకిలీ డిగ్రీ కలిగిన వ్యక్తి రాష్ట్ర మంత్రి మండలిలో కొనసాగుతున్నందువల్ల తమకు రోడ్లపైకి రావడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయిందన్నారు. తోమర్‌ను తొలగించేంతవరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇలాంటి అరాచకాలను తాము కొనసాగనివ్వబోమని హెచ్చరించారు. తమ పార్టీ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే అంశాన్ని పరిశీలిస్తోందని వెల్లడించారు. అవినీతి విషయంలో కేజ్రీవాల్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులను ఆయన అవినీతిపరులుగా చూస్తున్నారని మండిపడ్డారు. దక్షిణ ఎమ్సీడీకి చెందిన ఇంజనీరుపై దాడి చేసి తన విధులు నిర్వహించకుండా అడ్డుపడిన తిలక్‌నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలైనపప్పటికీ సీఎం కేజ్రీవాల్ పట్టించుకోవడంలేదన్నారు.
ఆప్‌కు ‘నకిలీ’ సంకటం
Published Thu, Apr 30 2015 1:00 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
Advertisement