
కేసీఆర్ నుంచి స్పందన రాలేదు
హైదరాబాద్ : వరంగల్ లోక్సభ, మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కసరత్త చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. అందులోభాగంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ మంగళవారం హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం హైదరాబాద్లో వెల్లడించారు. ఈ ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా ఖరారు అవుతుందని ఆయన తెలిపారు.
అయితే నారాయణ్ఖేడ్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కూ లేఖ రాసిన సంగతి ఈ సందర్భంగా ఉత్తమ్ గుర్తు చేశారు. ఈ అంశంపై కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గతేడాది జరిగిన వరంగల్ లోక్సభ స్థానానికి కడియం శ్రీహరి ఎన్నికయ్యారు. అయితే ఆయన్ని కేసీఆర్ తన కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది.
ఆ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వివేక్, ఎం రాజయ్య, బలరాం నాయక్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పేరు కూడా వినపడింది. కానీ ఎవరిని ఖరారు చేసేది మరో మూడు నాలుగు రోజుల్లో తెలనుంది. అలాగే మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి ఆగస్టు 25వ తేదీన గుండెపోటుతో ఆకస్మాత్తుగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో నారాయణ్ఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.