
మంటలు రాజేస్తున్న సుబ్రహ్మణ్యంస్వామి
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యంస్వామి సొంత పార్టీ తీవ్ర ఆరోపణలు చేశారు. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో చెలరేగిన సంక్షోభం వెనుక కొంత మంది బీజేపీ నాయకులు ఉన్నారని అగ్గి రాజేశారు. ‘ఒక పార్టీగా బీజేపీకి ఈ సంక్షోభంతో సంబంధం లేదు. కానీ కొంత మంది బీజేపీ నేతల హస్తం ఉంద’ని ఆయన వ్యాఖ్యానించారు. పన్నీరు సెల్వం తన రాజీనామాను వెనక్కు తీసుకోలేరని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రిగా శశికళతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ విద్యాసాగరరావు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేసేందుకు అన్నాడీఎంకే ఎంపీలు రాష్ట్రపతిని కలవడానికి సిద్ధమయ్యారని తెలిపారు.
‘తమిళనాడులో ఇలాంటి రాజకీయ సంక్షోభ పరిస్థితులు పెట్టుకొని గవర్నర్ మహారాష్ట్రలో కూర్చోవడం తగదు. ఆయన వచ్చి బాధ్యతల ప్రకారం ప్రమాణం చేయించాలి. ఒక వేళ పూర్తి స్థాయి మద్దతు లేకుండా ఉంటే మాత్రం రాజకీయ అనిశ్చితి ఎలాగో తప్పదు’ అంటూ ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతకుముందు అన్నారు.