
హోదా లేదు.. సాయమే..
- ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు న్యాయపరమైన అడ్డంకులు: సుజనా వెల్లడి
- ఏటా రూ.3 వేల కోట్ల వరకు సాయం ఉండొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు న్యాయపరమైన ఇబ్బందులు ఉన్న మాట నిజమేనని కేంద్రమంత్రి వైఎస్ చౌదరి (సుజనాచౌదరి) చెప్పారు. హోదా లేకుండానే.. ప్రత్యేక హోదా ఉంటే ఎంత సాయం అందుతుందో ఆ మేరకు నిధులు అందించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు. గురువారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, రాయపాటి సాంబశివరావు, మాల్యాద్రి శ్రీరాంతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సాధారణంగా కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్రం వాటా 70 శాతం, రాష్ట్రం వాటా 30 శాతం ఉండేది.
ప్రస్తుతం అది 60ః40గా ఉంది. అదే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు 90ః10 నిష్పత్తిలో గ్రాంట్లు ఉండేవి. అంటే ప్రత్యేక హోదా లేకపోతే కేంద్ర వాటాలో 30 శాతం వాటా మనకు తగ్గుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రంపై ఎంత భారం పడుతుందో అంతమేర నిధులు ఇవ్వాలని, హోదా లేకుండానే సాయం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎంతమేర ఉంటుందన్నది వాళ్లు లెక్క కడుతున్నారు. ఏటా రూ. 2,500 కోట్ల నుంచి రూ. 3 వేల కోట్ల వరకు ఉంటుందని మా అంచనా. ప్రత్యేక హోదా ఇవ్వటంలేదని స్పష్టమైనట్టేనా అన్న ప్రశ్నకు.. ‘ప్రత్యేక హోదాపై మీరు కోటిసార్లు అడిగినా స్పష్టత ఇదే. అది చట్టంలో లేదు. అది మన డిమాండ్ మాత్రమే..’ అని చెప్పారు.
మెరుగ్గానే ఇస్తున్నట్టు..
ప్రత్యేక హోదా ద్వారా అనేక ప్రాజెక్టులు, రాయితీలు, తద్వారా పరిశ్రమలకు పెట్టుబడులు లభించేవి కదా? అన్న ప్రశ్నకు.. ‘14వ ఆర్థిక సంఘం వచ్చాక కేంద్ర పన్నుల వాటాల్లో రాష్ట్రాలకు కేటాయింపులు 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగాయి. బడ్జెటరీ కేటాయింపులు మారిపోయాయి. ఇప్పుడు వాళ్లు చెబుతున్నట్టుగా ఇస్తే.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల కంటే మనకు మెరుగ్గానే ఇస్తున్నట్టు లెక్క..’ అని సుజనాచౌదరి పేర్కొన్నారు. రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం ఒప్పుకుందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లు ఆరేళ్ల పాటు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని చెప్పారు.
ఎక్కువే ఉండొచ్చు : రైల్వేలైన్లు, రహదారులు, ఇవన్నీ కలిపి రూ.1,10,000 కోట్ల ప్యాకేజీ ఉంటుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘వాటన్నింటినీ గణిస్తే ఎక్కువే ఉండొచ్చు..’ అని సుజనా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏమేం చేశారు, ఇంకా ఏమేం చేయాలనే స్టేట్‌మెంట్ తయారు చేస్తున్నారని చెప్పారు.పోలవరం ప్రాజెక్టుకు 11వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా భరించాలనే నిబంధన అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. రైల్వేజోన్ అంశం ఇంకా చర్చల్లోనే ఉందన్నారు. కడప స్టీలు ప్లాంటును ప్రస్తావిస్తూ మరో కమిటీ వేశారనీ, ప్రత్యామ్నాయ పద్ధతిలో అమలుచేస్తామన్నారు. పోర్టులు, విమానాశ్రాయాలు అభివృద్ధి చేస్తారన్నారు.