నవంబర్‌లోపు పూర్తి రుణమాఫీ చేయాలి | November will need to complete loan waiver | Sakshi
Sakshi News home page

నవంబర్‌లోపు పూర్తి రుణమాఫీ చేయాలి

Published Sun, Oct 4 2015 1:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

నవంబర్‌లోపు పూర్తి రుణమాఫీ చేయాలి - Sakshi

నవంబర్‌లోపు పూర్తి రుణమాఫీ చేయాలి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని రైతుల రుణాలన్నింటినీ వచ్చే నవంబర్‌లోపే పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యల నివారణకు, వారిని ఏవిధంగా ఆదుకోవాలనే అంశంపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు కరీంనగర్ జిల్లాలో షర్మిల చేపట్టిన యాత్ర ముగిసిన అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు 1,400 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడంతోపాటు వెంటనే కొత్త రుణాలు అందజేస్తే తప్ప ప్రయోజనం ఉండదన్నారు. పంటలకు కేంద్రం ఇస్తున్న కనీస మద్దతు ధరతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ వస్తుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశే ఎదురవుతోందని... ప్రభుత్వం ఇంకా సొల్లు మాటలు, కాలక్షేప చర్యలను పక్కనపెట్టాలని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అంటే ఏవిధంగా ఉండాలో చూపిన గొప్పనేత వైఎస్సార్ అని కొనియాడారు.

రైతులకు ఒకేసారి రుణమాఫీతో పాటు ఉచిత విద్యుత్, కరెంటు బకాయిల రద్దు, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. వైఎస్ ఐదేళ్ల పాలనలో 46 లక్షల పక్కా ఇళ్లను నిర్మిస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలైనా ఒక్క ఇల్లు కూడా కట్టించలేకపోవడం సిగ్గుచేటన్నారు. కరీంనగర్ జిల్లాలో రెండు విడతలుగా కొనసాగిన యాత్రలో షర్మిల 885 కిలోమీటర్లు ప్రయాణించి 30 కుటుంబాలను పరామర్శించారని తెలిపారు. జిల్లాలో చివరిరోజు యాత్రలో జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మైనారిటీ, డాక్టర్స్ విభాగం అధ్యక్షులు ముజతబా అహ్మద్, డాక్టర్ ప్రపుల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు భీష్వ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement