ఇక స్మార్ట్‌ఫోన్ తో మైక్రోస్కోప్!
లండన్: ప్రయోగాల కోసం ఉపయోగించే సూక్ష్మదర్శిని (మైక్రోస్కోపు)ని ఇక మనం కూడా సొంతంగానే తయారు చేసుకోవచ్చట. మన దగ్గర ఓ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. మార్కెట్లో దొరికే నట్లు, బోల్టులు, లేజర్ లైట్లు, ప్లైవుడ్ వంటి కొన్ని పరికరాలు, వస్తువులను కొని బిగించుకుంటే ఇక సూక్ష్మదర్శిని రెడీ అయినట్లే. ఖరీదైన సూక్ష్మదర్శినులకు ఏమాత్రం తీసిపోకుండా.. ఈ స్మార్ట్‌ఫోన్ సూక్ష్మదర్శిని కూడా వస్తువులను 175 నుంచి 400 రెట్లు పెద్దగా చూపిస్తుందట. అతిచౌకగా సూక్ష్మదర్శిని తయారీ ప్రాజెక్టులో భాగంగా మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఈ సరికొత్త సూక్ష్మదర్శినిని తయారు చేశారు.
మామూలు సూక్ష్మదర్శినులు చాలా ఖరీదు కావడంతో ఇప్పటికీ చాలా కాలేజీలు, స్కూళ్లలో సైన్స్ ప్రయోగాలకు అవసరమైన సూక్ష్మదర్శినులు అందుబాటులో ఉండటం లేదని, అందుకే తాము ఈ ‘డూ-ఇట్-యువర్‌సెల్ఫ్ మైక్రోస్కోప్’ (డీఐవై) తయారీ ప్రాజెక్టును చేపట్టామని వర్సిటీ విద్యార్థులు తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ మైక్రోస్కోపు తయారీకి మొత్తం ఖర్చు దాదాపు రూ.600(10 డాలర్లు) మాత్రమే కావడం విశేషం.