యోగి ఆధిత్యనాథ్‌పై కేసులేమవుతాయి?
ఇప్పటి వరకు ఎంపీగా ఉన్న ఆధిత్యనాథ్‌పై రాష్ట్ర పోలీసులు కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇక రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనపై చర్యలు ఎలా తీసుకుంటారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
లక్నో: పద్దెనిమిది సంవత్సరాల క్రితం, 1999, ఫిబ్రవరి 10వ తేదీన భారతీయ జనతా పార్టీకి చెందిన గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆధిత్యనాథ్ తన సాయుధ అనుచరులతో కలసి వెళ్లి ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ జిల్లా పాంచ్‌రుఖియా గ్రామంలో ఓ ముస్లింల శ్మశానాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని అక్కడి నుంచి తరమికొట్టారు. అదే సమయంలో ప్రధాన రహదారిపై అప్పటి రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శన జరుపుతున్న సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు, పారిపోతున్న ఆధిత్య బృందానికి తారసపడ్డారు. వారిపై ఆగ్రహంతో ఆధిత్యనాథ్ బృందం వారిపైకి కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న సమాజ్‌వాది పార్టీ నాయకుడు తలత్ అజీజ్‌కు వ్యక్తిగత అంగరక్షుకుడిగా విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సత్యప్రకాష్ యాదవ్ ఆ కాల్పుల్లో గాయపడి తదనంతరం మరణించారు. ఆదేరోజు సాయంత్రం ఆధిత్యనాథ్, ఆయన 24 మంది అనుచరులపై మహారాజ్ గంజ్ పోలీసు స్టేషన్లో హత్యాయత్నం, దొమ్మి, అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉండడం, ముస్లింల పవిత్ర స్థలంలోకి అనుమతి లేకుండా దౌర్జన్యంగా ప్రవేశించడం తదితర అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో ఇప్పటికీ ఆ అభియోగాలు విచారణలోనే ఉన్నాయి. వాటిని రాష్ట్ర పోలీసు విభాగంలోని సీబీసీఐడి పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రానికే ముఖ్యమంత్రయ్యారు.
ఆధిత్యనాథ్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన ఏడాదిలోగానే అంటే 1998లో గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1999లో ముస్లింల శ్మశానాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన అనంతరం, గోద్రా అల్లర్ల నేపథ్యంలో 2002 ఆధిత్యనాథ్ హిందూ యువ వాహిణిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2007 వరకు 24 మత ఘర్షణలు జరగ్గా, పలువురి ప్రాణాలను బలితీసుకున్న ఘర్షణలు ప్రధానంగా ఏడు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఆధిత్యనాథ్, ఆయన అనుచరులపై పలు కేసులు దాఖలయ్యాయి. ఆ కేసులు కూడా ఇప్పటికీ కూడా రాష్ట్ర పోలీసుల విచారణలోనే ఉన్నాయి.
2007 వరకు పలు మత ఘర్షణల్లో ఆధిత్యనాథ్ ప్రత్యక్షంగా పాల్గొనగా, అప్పటి నుంచి తెర వెనక పాత్రకు మాత్రమే పరిమితం అవుతూ వస్తున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ మత ఘర్షణలను రెచ్చగొడుతున్నారు. ఈ ప్రసంగాలకు సంబంధించి కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఎంపీగా ఉన్న ఆధిత్యనాథ్‌పై రాష్ట్ర పోలీసులు కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇక ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనపై చర్యలు ఎలా తీసుకుంటారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.