ఇక టీవీలు ఇక్కడ కొనాల్సిందే | NRIs' grouse against additional customs duty on flat TV | Sakshi
Sakshi News home page

ఇక టీవీలు ఇక్కడ కొనాల్సిందే

Published Sat, Aug 24 2013 3:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

ఇక టీవీలు ఇక్కడ కొనాల్సిందే

ఇక టీవీలు ఇక్కడ కొనాల్సిందే

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  విదేశాల్లో ఉన్న మీ కుటుంబసభ్యులు లేదా సన్నిహితులు మీ కోసం టీవీ తీసుకొస్తున్నారా? తక్కువ ధరలో ఎంచక్కా టీవీ వచ్చేస్తోందని ఆనందపడుతున్నారా? అయితే మీ ఆనందానికి బ్రేక్ పడనుంది. దీనికి కారణం టీవీలపై రూ.35 వేల వరకు ఉన్న ఉచిత బ్యాగేజీని ఆగస్టు 26 నుంచి ప్రభుత్వం ఉపసంహరిస్తోంది. దీని ప్రభావంతో విదేశాల నుంచి వచ్చే టీవీలపై పూర్తి కస్టమ్స్ సుంకం పడడంతో అవి మరింత ఖరీదవుతాయి. రూపాయి పతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విమాన ప్రయాణికులు వ్యతిరేకిస్తుండగా, దేశీయ ఎలక్ట్రానిక్ కంపెనీలు సంబరపడుతున్నాయి.
 
 బ్యాంకాక్ ధర ఆధారంగా..
  భారత్‌లో ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఖరీదు ఎక్కువ. అందుకే దుబాయి, బ్యాంకాక్, థాయ్‌లాండ్, మలేషియా తదితర దేశాల నుంచి ఇక్కడికి వచ్చే భారతీయులు, ఎన్నారైలు టీవీ, కెమెరా, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ పీసీ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకురావడం పరిపాటి. అత్యధిక ంగా టీవీలను తీసుకొస్తున్నారు. టీవీలపై (ప్లాస్మా, ఎల్‌ఈడీ, ఎల్సీడీ) బ్యాగేజీ కింద రూ.35 వేల విలువ వరకు ప్రస్తుతం ఎటువంటి పన్ను లేదు. బ్యాగేజీ విలువ రూ.35 వే లు దాటితే కస్టమ్స్, విద్యా సెస్సు కింద 36.05 శాతం పన్ను చెల్లించాలి. ఒక కంపెనీకి చెందిన ఒక మోడల్ ధర ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. అందుకే ఇక్కడి కస్టమ్స్ అధికారులు బ్యాంకాక్‌లో ఉన్న ధరను ప్రాతిపదికగా చేసుకుని పన్ను విధిస్తున్నారు. 40 అంగుళాల బేసిక్ టీవీ భారత్‌లో రూ.35 వేలపైనే ఉంది. అదే థాయ్‌లాండ్‌లో రూ.29 వేలు, బ్యాంకాక్‌లో రూ.27 వేలకు లభిస్తోందని కస్టమ్స్ వర్గాల సమాచారం. ఉదాహరణకు బ్యాంకాక్‌లో రూ.27 వేలకు టీవీ కొంటే కొత్త నిబంధనల ప్రకారం కస్టమ్స్ డ్యూటీ రూ.9,733 అవుతుంది. దీంతో టీవీ ధర కాస్తా రూ.36,733కు చేరుతుంది.
 
 అమ్ముకోవడానికే ఎక్కువ..
 టీవీని సొంతానికి తీసుకొచ్చే వారు తక్కువగా ఉంటారని, అమ్మడానికే తీసుకొచ్చే వారే ఎక్కువని కస్టమ్స్ అధికారులు అంటున్నారు. ల్యాప్‌టాప్‌ల విషయంలో ఒకటి ఆఫీసుదని, మరొకటి వ్యక్తిగతమని బుకాయిస్తారని కస్టమ్స్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఒరిజినల్ బిల్లులను పరిశీలించాకే సుంకం నిర్ణయిస్తామని చెప్పారు. ఎవరు సొంతానికి, ఎవరు విక్రయించడానికి తీసుకొస్తున్నారో వెంటనే పసిగడతామని ఆయన పేర్కొన్నారు. ఉపకరణాలను స్వాధీనం చేసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. అయితే బ్యాంకాక్‌లో కొన్న ఉపకరణాలు త్వరగా పాడవుతున్నాయని పలువురు ప్రయాణికులు చెబుతున్నారని ఆయన వివరించారు. బ్యాంకాక్ నుంచి టీవీలు తీసుకురావడం చాలా తగ్గిందని  తెలిపారు.  
 
 అడ్డుకట్ట పడ్డట్టే..
 టీవీలు రూ.30 వేల ధర లోపు లభించడంతో 32, 40 అంగుళాల సైజున్న మోడళ్ళు ఎక్కువగా భారత్‌కు వస్తున్నాయి. ఏటా సుమారు 12 లక్షల టీవీలు భారతీయులు, ఎన్నారైల ద్వారా భారత్‌కు వస్తున్నాయని గృహోపకరణాల విక్రయ సంస్థ పాయ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఎండీ రాజ్‌కుమార్ పాయ్ తెలిపారు. ఒక్క సౌదీ అరేబియా నుంచే నెలకు 20 వేల టీవీలు ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి. ఆగస్టు 26 నుంచి ఎటువంటి మినహాయింపు ఉండకపోవడంతో ప్రయాణికులు పూర్తిగా సుంకం చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన అటూఇటూగా భారత్‌లో లభిస్తున్న టీవీ ధరకు సమానం అవుతుంది. జీరో డ్యూటీ ఎత్తేయడంతో టీవీల రాక దాదాపుగా నిలిచిపోతుందని ఒనిడా బ్రాండ్‌తో ఉపకరణాలను విక్రయిస్తున్న మిర్క్ ఎలక్ట్రానిక్స్ సీఎండీ జి.ఎల్.మిర్‌చందానీ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. దేశీయంగా పెట్టుబడులను, తయారీ రంగాన్ని ప్రోత్సహించాలంటే జీరో డ్యూటీని ఎత్తేయాలని ఆయన అన్నారు. దేశీయంగా వివిధ కంపెనీలు బహిరంగ మార్కెట్లో ఏటా 65 లక్షల టీవీలు విక్రయిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement