జిల్లాలపై నిమిషానికో ఫిర్యాదు | Number of complaints on districts reorganisation proposals | Sakshi
Sakshi News home page

జిల్లాలపై నిమిషానికో ఫిర్యాదు

Published Wed, Aug 24 2016 4:56 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

జిల్లాలపై నిమిషానికో ఫిర్యాదు - Sakshi

జిల్లాలపై నిమిషానికో ఫిర్యాదు

- పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాల వెల్లువ

- రెండో రోజున వెల్లువెత్తిన ఆన్‌లైన్ విజ్ఞప్తులు

- యాదాద్రి, హన్మకొండ జిల్లాలపై అత్యధికం

సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన ముసాయిదాపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు సగటున నిమిషానికో విజ్ఞప్తి రావడం గమనార్హం. కొత్త జిల్లాల పునర్విభజనపై అభిప్రాయాల స్వీకరణకు ప్రభుత్వం ప్రారంభించిన వెబ్‌సైట్‌కు పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు, సలహాలు వస్తున్నాయి. మంగళవారం రాత్రి పది గంటల వరకు 40 వేల మందికిపైగా ఈ వెబ్‌సైట్‌ను వీక్షించగా.. 1,604 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటితో పాటు కలెక్టర్లకు, సీసీఎల్‌ఏకు నేరుగా సమర్పించిన ఫిర్యాదులు కలిపితే ఈ సంఖ్య మరింతగా ఎక్కువగా ఉండనుంది.

 

వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం... ప్రతిపాదిత కొత్త జిల్లాలపై 988, కొత్త రెవెన్యూ డివిజన్లపై 388, కొత్త మండలాలపై 228 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. అందులో వరంగల్, నల్లగొండ జిల్లాలను విభజించిన తీరుపైనే ఎక్కువగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లాకు సంబంధించి 220 అర్జీలు దాఖలయ్యాయి. హన్మకొండ జిల్లాపై 169, వనపర్తి జిల్లాపై 116 అర్జీలు నమోదయ్యాయి. ఆచార్య జయశంకర్ జిల్లాపై 58, పెద్దపల్లి జిల్లాపై 56 అభ్యంతరాలు/విజ్ఞప్తులు ఉన్నాయి. నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల నుంచి సలహాలు, సూచనలు తక్కువగా ఉండడం గమనార్హం. మరోవైపు కొత్తగా ప్రతిపాదించిన డివిజన్లపైనా అభ్యంతరాలు వచ్చాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసే డివిజన్లపై 216 ఫిర్యాదులు అందాయి. మండలాల వారి గా చూస్తే జగిత్యాల జిల్లాలో కలిపిన మండలాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

సాగుతున్న మ్యాప్‌ల తయారీ

జిల్లాల పునర్విభజన అంశంపై వివిధ రకాలుగా జిల్లాల మ్యాప్‌లను తయారు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం.. ముసాయిదా నోటిఫికేషన్‌కు అనుగుణంగా మ్యాప్‌లను మంగళవారం కూడా విడుదల చేయలేదు.

తప్పులు దిద్దుతున్న రెవెన్యూశాఖ

జిల్లాల పునర్విభజన ముసాయిదాలో దొర్లిన తప్పులను రెవెన్యూ శాఖ సవరిస్తోంది. ఇప్పటికే వివిధ జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన సమాచారం మేరకు రెండు సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు జారీ చేసిన జీవో నం.372ను రహస్యంగా ఉంచిన రెవెన్యూ శాఖ.. జీవోల వెబ్‌సైట్‌లో దాన్ని ఖాళీగా ఉంచింది. హన్మకొండ, యాదాద్రి రెండింటిలోనూ పొందుపరిచిన దేవరుప్పుల మండలం విషయంలో అందులో స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. ఇక ప్రతిపాదిత నాగర్‌కర్నూల్ జిల్లాలో చేర్చిన వంగూర్ మండలం నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్‌లో ఉన్నట్లుగా ముసాయిదా నోటిఫికేషన్‌లో ప్రకటించింది. అయితే ఆ మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న అచ్చంపేట రెవెన్యూ డివిజన్‌లో ప్రతిపాదించినట్లు మరో సవరణ(జీవో నం.373)లో స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement