
సమీప భవిష్యత్తులో పసిడి పటిష్టంగా ఉంటుందన్నది పరిశీలకుల అభిప్రాయం. భౌగోళిక ఉద్రికత్తలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనాల మధ్య తెరపడని వాణిజ్య ఉద్రిక్తతల వంటి అంశాలు పసిడిపై ఇన్వెస్టర్ల మక్కువను పెంచుతున్నాయి. అమెరికా అధ్యక్షుని అభిశంసనపై నెలకొన్న పరిణామాలు కూడా పసిడి ధరను ప్రభావితం చేస్తాయన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం– పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,480 డాలర్ల దిగువనకు పడిపోదన్నది విశ్లేషణ. ఈ మద్దతూ కోల్పోతే సమీప కాలంలో 1,450 వద్ద గట్టి మద్దతు ఉంటుందని అభిప్రాయం.
లాభాల స్వీకరణ పరిస్థితుల్లో...
27వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌నైమెక్స్‌లో ఒక దశలో 1,540 డాలర్ల స్థాయిని తాకిన పసిడి, చివరిలో 1,500 డాలర్ల దిగువకు (1,495 డాలర్ల వరకు) పడిపోయినా, వెంటనే రికవరీ అయింది. 1,503 డాలర్ల వద్ద ముగిసింది. వారం వారీగా మాత్రం 20 డాలర్లు తగ్గింది. అయితే లాభాల స్వీకరణ దృష్ట్యా, పసిడి సమీప కాలంలో 1,450 డాలర్లను చూసే అవకాశాలు ఉన్నాయన్నది కొందరి విశ్లేషణ. అయితే ఇదే సమయంలో ఈక్విటీ మార్కెట్లకు లాభాలు, భౌగోళిక ఉద్రిక్తతల ఉపశమనం వంటి అంశాలు తోడయితే, వేగంగా 1,350 డాలర్ల శ్రేణికి పడిపోవచ్చు.
ఈ స్థాయి పసిడికి అత్యంత కీలకం కావడం గమనార్హం. శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రుహానీ ఒక ప్రకటన చేస్తూ, ఇరాన్‌పై అన్ని ఆంక్షలూ తొలగిస్తామని, చర్చలు పునఃప్రారంభించడానికి అభ్యంతరం లేదని అమెరికా ఆఫర్ ఇచ్చినట్లు ప్రకటించారు. ఇదే జరిగితే, బంగారం ధర తిరిగి 1,350 డాలర్లను వేగంగా తాకవచ్చు. అయితే దీనిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. అందువల్ల వచ్చే రెండు వారాలూ పసిడి ధర కదలికలకు కీలకం.