వాషింగ్టన్: అణ్వాయుధాల వాడకం విషయంలో పాకిస్తాన్ నిగ్రహాన్ని పాటించాని అమెరికా సందేశాన్ని పంపింది. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద సంస్థల మీద చర్యలు తీసుకోవాలని పాక్కు సూచించింది. అణ్వాయుధాలు కలిగిన దేశాలు, వాటి వాడకం విషయంలో నిగ్రహంతో ఉండాల్సిన బాధ్యత ఉందని యూఎస్ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు. పాక్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అణ్వాయుధాలను సైతం వాడడానికి సిధ్దంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మార్క్ టోనర్ విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా బదులిచ్చారు. భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందన్నారు.
ఉడీ ఉగ్రదాడుల అనంతరం జరుగుతున్న పరిణామాల తర్వాత తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్న విషయాన్ని పాకిస్థాన్ పదే పదే బయటకు చెబుతున్న విషయం తెలిసిందే. భారతదేశంతో ఒకవేళ యుద్ధం అంటూ వస్తే వాటిని ఉపయోగించడానికి ఏ మాత్రం వెనకాడేది లేదని అంటోంది. తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలు ఆటబొమ్మలేవీ కావని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. ''మా దగ్గర ఉన్న వ్యూహాత్మక ఆయుధాలను మా రక్షణ కోసమే తయారు చేశాం. ఈ ఆయుధాలు ఆటబొమ్మలు ఏమీ కావు. మా క్షేమానికి ఏమైనా ముప్పు ఉందనుకుంటే వాటిని వెంటనే ఉపయోగంలోకి తీసుకొస్తాం'' అని ఆసిఫ్ చెప్పారు.
ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తుందన్న భయం ఏమీ లేదని.. కానీ ఖురాన్‌లో అల్లా చెప్పినట్లు, 'గుర్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి' అని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. పాకిస్థాన్ మీద ఎప్పుడూ ఒత్తిడి ఉంటూనే ఉందని, అందువల్ల అవసరమైన వాటి కంటే ఎక్కువగా తమదగ్గర వ్యూహాత్మక ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తమదే ఆధిక్యం అన్న విషయానికి అంతర్జాతయంగా కూడా గుర్తింపు ఉందని చెబుతూ.. ఎవరైనా తమ గడ్డమీద అడుగుపెట్టినా, తమ అంతర్గత భద్రతకు ముప్పు తేవాలని చూసినా తమ రక్షణ కోసం ఆ ఆయుధాలను ఉపయోగించడానికి వెనుకాడబోమని అన్నారు. భారతదేశంతో యుద్ధం వస్తే పాకిస్థాన్ అణ్వాయుధాలు ఉపయోగిస్తుందా అన్న ప్రశ్నకు.. అది పరిస్థితులను బట్టి ఆధారపడుతుందని, తమ ఉనికి ప్రమాదంలో పడితే తాము అన్నింటినీ ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అందులో భయపడాల్సింది ఏముందని ఎదురు ప్రశ్నించారు.
హిల్లరీ ఆందోళన
పాకిస్తాన్‌లో అణ్వాయుధాలు జీహాదీల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం తప్పదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భయాందోళనలు వ్యక్తం చేశారు. తద్వారా అణుఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. ‘జీహాదీలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారన్న భయంతో జీవిస్తున్నాం. వారు అణ్వాయుధాలు హస్తగతం చేసుకుంటారు. ఫలితంగా అణు ఆత్మాహుతి దాడులకు అవకాశం ఏర్పడుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.
డెమోక్రటిక్ పార్టీ కంప్యూటర్ల హ్యాకింగ్ ద్వారా హిల్లరీ మాట్లాడిన ఆడియో సారాంశాన్ని పత్రిక వెల్లడించింది.గత ఫిబ్రవరిలో వర్జీనియాలో నిధుల సేకరణ సందర్భంగా ఆమె సన్నిహితులతో ఈ వ్యాఖ్యలు చేశారంది. భారత్‌తో ఉన్న శత్రుత్వంతో పాక్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని హిల్ల రీ పేర్కొన్నారు. రష్యా, చైనాతో పాటు పాక్, భారత్ అణ్వాయుధాల్లో పోటీపడుతున్నాయని... ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని అన్నారు.
పాక్కు యూఎస్ సందేశం
Published Sat, Oct 1 2016 11:54 AM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM
Advertisement
Advertisement