అదితి.. నువ్వెక్కడ?
* డ్రైనేజీల్లో విస్తృత గాలింపు
* గజఈతగాళ్లు దిగినా చిక్కని ఆచూకీ
మద్దిలపాలెం(విశాఖపట్నం): ఆరేళ్ల అదితి ఆచూకీ తెలియలేదు. ఏక్షణం ఏ కబురు వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు ఆందోళనగా నిరీక్షిస్తున్నారు. విశాఖనగరం మద్దిలపాలెంలో గురువారం సాయంత్రం ట్యూషనుకు వెళ్లిన చిన్నారి అదితి వర్షపునీటి ఉధృతికి మురుగుకాలువలో పడి కొట్టుకుపోయింది. స్థానికులు గురువారం రాత్రి కాలువలన్నీ వెతికినా ఫలితం కనిపించలేదు. ఆలస్యంగా స్పందించిన జీవీఎంసీ సిబ్బంది బాలిక అన్వేషణలో పడ్డారు.
మద్దిలపాలెం మొదలుకుని ఎంవీపీ కాలనీవరకూ డ్రెయినేజీ వ్యవస్థను జల్లెడ పడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఎంవీపీ కాలనీ కాలువలో గజ ఈతగాళ్ల బృందం మూడు సార్లు దిగినా ఫలితం కనిపించలేదు. జీవీఎంసీ కమిషన ర్ ప్రవీణ్‌కుమార్ శుక్రవా రం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తల్లికి తెలియనివ్వకుండా..
అదితి తల్లిదండ్రులు బెంగళూరులో ఉంటుండగా ఆమె విశాఖలో తాతగారి దగ్గర ఉంటోంది. తల్లిదండ్రులు బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం సీతమ్మధార చేరుకున్నారు. అదితికి ఆరోగ్యబాగాలేక ఆసుపత్రిలో చేర్పించామని బాలిక తల్లికి కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమెకు గల్లంతు విషయం తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. బాలిక తండ్రి శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు.