సాక్షి, బెంగళూరు: ఉల్లి ధర ఘాటు మరికొంత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. ధరలు మరో రెండు నుంచి మూడు వారాలు అధిక స్థాయిలలోనే కొనసాగవచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ అన్నారు. బెంగళూరులో కృషి విజ్ఞాన కేంద్రాల ఎనిమిదో జాతీయ సదస్సుకు హాజరైన పవార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉల్లి ధరలపై చర్చించడానికి గురువారం తాను, ఆహార మంత్రి సమావేశం కానున్నామని చెప్పారు. పలు రాష్ట్రాలలో కిలో ఉల్లి ధర 90 రూపాయలకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ నిల్వదారులపై నిత్యావసరాల చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వర్షాలతో ఉల్లి పంట దెబ్బతినడంతో సరఫరాలపై ప్రభావం పడిందని తెలిపారు. వచ్చే రెండు మూడు వారాల్లో ఉల్లి ధరలు దిగి వస్తాయంటారా? అన్న ప్రశ్నకు.. ‘ నేను జ్యోతిష్యుడిని కాదు. నా అంచనా ప్రకారం మరో మూడు వారాలు ఇదే పరిస్థితి ఉంటుంది’ అని బదులిచ్చారు.