రాహుల్ తానేంటో నిరూపించుకోవాలి: పవార్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 2014 లోక్సభ ఎన్నికలకు ముందు తానేంటో నిరూపించుకోవాలని నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పనిచేసివుంటే రాహుల్ సమర్థత తెలిసేదని, కాని ఆయన అలా చేయలేదని ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ పవార్ అన్నారు. మన్మోహన్ నేతృత్వంలో పనిచేసివుంటే ఆ అనుభవం రాహుల్కు దోహపడేదని అభిప్రాయపడ్డారు.
రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకించనని చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు పవార్ ఇష్టపడలేదు. అయితే రాహుల్ నాయకత్వంలో పనిచేయడానికి అంగీకస్తారా అని అడిగినప్పుడు... ఇది కలిసి పనిచేయడానికి సంబంధించిన ప్రశ్న కాదని, ఇద్దరికీ మధ్య జనరేషన్ గ్యాప్ ఉందని సమాధానమిచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి కొంచెం ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశారు.
ప్రాంతీయ పార్టీల మద్దతుతో యూపీఏ మరింత పరిపుష్టం కావాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్తో తన భాగస్వామ్యం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ప్రధాని రేసులో లేనని పవార్ తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభావం పెద్దగా ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉల్లిపాయల ధర అంశం తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశం కాదన్నారు.