చెన్నై: కేరళ నుంచి తమిళనాడులోకి మావోయిస్టుల చొరబాటు అనుమానంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోయంబత్తూరులో మావోయిస్టుల సంచారం సమాచారంలో జాతీయ భద్రత దళాలు రంగంలోకి దిగాయి. స్థానిక పోలీసులతో కలిసి అడవుల్లో కూంబింగ్ ప్రారంభించాయి. కేరళ రాష్ట్రం పుతూరు సమీపంలోని కడుగుమన్నామలై గ్రామంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఈ నెల 17వ తేదీన కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో కొందరు మావోయిస్టులు గాయపడి పరారయ్యారు. వారి కోసం జాతీయ భద్రతా దళాలు కోయం బత్తూరు జిల్లా బిల్లూరు చెరువు తీరంలో గాలింపు చేప్టటాయి.
ఈ దళాలకు చెందిన 50 మందితో పాటూ మేట్టుపాళయం, అన్నూర్, కారమడై, పెరియనాయకన్ పాళై, శిరుముగైలోని మరో 15 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన 30 మంది కలిసికట్టుగా కోవై అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే అటవీ గ్రామాల్లోని మావోయిస్టు సానుభూతిపరులను విచారిస్తున్నారు. మావోయిస్టుల సంచారం ఉన్నట్లుగా అనుమానించే ప్రాంతాలను చుట్టుముడుతూ రాష్ట్ర సరిహద్దుల్లోని పది ప్రత్యేక చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. పోలీస్‌స్టేషన్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ముఖ్యమైన ప్రదేశాలకు బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో తూర్పుమండల పోలీస్ ఐజీ శంకర్ మాట్లాడుతూ ఉత్తర మండలాల సరిహద్దులోపల మావోయిస్టులు లేరని , అయితే కేరళ సరిహద్దుల నుంచి తమిళనాడులోకి ప్రవేశించకుండా ముందు జాగ్రత్తలు చేపడుతున్నామని అన్నారు. కేరళలో జరిగిన కాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు తమిళనాడు తూర్పు జిల్లాల్లోకి ప్రవేశించలేదని చెప్పారు. కోవై జిల్లా ఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా సరిహద్దులోని చెక్‌పోస్టులు, పోలీస్ స్టేషన్లలో నిఘా కెమెరాలు అమర్చామని చెప్పారు. కేరళ కాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు చికిత్స కోసం సరిహద్దులోని కోవైకు వచ్చే అవకాశాలు ఉన్నందున ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్, జాతీయ భద్రతా దళాలు, స్థానిక పోలీసులు మూకుమ్మడిగా కూంబింగ్ నిర్వహిస్తున్నారని చెప్పారు.