ఓపీఎస్-ఈపీఎస్: తమిళనాట ఏం జరుగుతోంది!
త్వరలోనే అన్నాడీఎంకే వైరివైర్గాల విలీనం.. ఎన్డీయేలో చేరిక
చెన్నై: అధికార అన్నాడీఎంకే పార్టీలోని రెండు వైరి వర్గాలైన ఓ. పన్నీర్ సెల్వం (ఓపీఎస్), ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్) గ్రూపుల విలీనానికి సర్వసిద్ధమైనట్టు కనిపిస్తోంది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆశీస్సులతో ఈ రెండు వర్గాలు ఏకతాటిపైకి రాబోతున్నాయి. అంతేకాదు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరబోతున్నాయి. కేంద్ర మంత్రిమండలిలో అన్నాడీఎంకేకు మూడు మంత్రి పదవులు దక్కే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఓపీఎస్ వర్గంతో చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఏకమవుతామని మంత్రి జయకుమార్ మంగళవారం స్పష్టం చేశారు.
దివంతగ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిన సంగతి తెలిసిందే. అధికార పీఠమే లక్ష్యంగా మొదట ఓపీఎస్-చిన్నమ్మ శశికళ గ్రూపులుగా అన్నాడీఎంకే వీడిపోయింది. అనంతర పరిణామాలలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత నెచ్చెలి శశికళ జైలుపాలు అవ్వడంతో ఆమె అనుంగు బంటుగా అధికార పీఠాన్ని చేపట్టిన ఈపీఎస్ ఆ తర్వాత క్రమంగా చిన్నమ్మకు దూరం జరిగి.. వైరిపక్షమైన ఓపీఎస్‌తో జత కట్టడానికి సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చారు. ఇలా ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఒకటవ్వడం బీజేపీ డైరెక్షన్‌లో జరిగినట్టు తెలుస్తోంది. జయలలిత మృతి తర్వాత తమిళనాడులో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ.. అన్నాడీఎంకేలోని వైరివర్గాలను ఒక్కతాటిపైకి తెచ్చి.. తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతం అయింది.
టార్గెట్.. తమిళనాడు..!
ఉత్తరాదిన కొనసాగుతున్న కమలవికాసాన్ని దక్షిణాదికీ విస్తరించాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్న బీజేపీ అధిష్టానం.. తెలుగురాష్ట్రాలతోపాటుగా తమిళనాడుపైనా ప్రత్యేక దృష్టిపెట్టింది. అందుకే తమిళగడ్డపై జరుగుతున్న ప్రతి రాజకీయ కదలికలోనూ తన ముద్ర ఉండేలా చూసుకుంటోంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకం ప్రారంభోత్సవం కోసం రామేశ్వరం వెళ్లిన ప్రధాని మోదీ.. తన ప్రసంగంలో జయలలితను గుర్తుచేసుకోవటం, అమ్మలేని లోటు స్పష్టంగా కనబడుతోందని చెప్పటం తమిళనాడుపై బీజేపీ ఆసక్తిని స్పష్టం చేసింది.
జయలలిత కన్నుమూశాక ఎనిమిది నెలల్లో మూడుసార్లు తమిళనాడు వచ్చిన మోదీ.. ఎప్పుడూ అమ్మ గురించి ఇంతలా ప్రస్తావించలేదు. కానీ, ఈసారి జయ, తమిళ ప్రజలపై ఇంతప్రేమను గుప్పించటం, తమిళనాట రాజకీయ గందరగోళాన్ని ప్రస్తావించటం కూడా మోదీ భవిష్యత్ ప్రణాళికలకు సంకేతాలే. బిహార్‌లో ప్రతిష్టాత్మకంగా ఏర్పడిన మహాకూటమిని విజయవంతంగా విచ్ఛిన్నం చేసి జేడీయూని తనవైపు తిప్పుకున్న కాషాయ దళం.. దక్షిణాదిన ద్రవిడ రాష్ట్రం తమిళనాడులో పార్టీ విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది.
ఏఐఏడీఎంకేలో చీలికలే..
నిజానికి తమిళనాట రాజకీయాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జయ మరణం తర్వాత ఏఐఏడీఎంకేలో ఆధిపత్యపోరు చీలికలు విపక్షాలు తమ పనిని చక్కబెట్టుకోవటంలో అపారమైన అవకాశాలు కల్పిస్తున్నాయి. విపక్ష డీఎంకే వేగంగా ఓటుబ్యాంకును పెంచుకుంటోంది. అన్నాడీఎంకేలో రెండు కూట ముల మధ్య వివాదంతో ప్రభుత్వం పని తీరు కూడా మందగించింది. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు, అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న నిస్తేజం వల్ల రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను తనకనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీంతో రాష్ట్రంలో కేవలం 2.5 శాతం ఓటుబ్యాంకున్న బీజేపీ తన పరిధిని మరింత విస్తృతపరుచుకోవాలని భావిస్తోంది.
కేంద్ర పథకాల వల్ల దేశంలో యువత మోదీ వైపు ఆకర్షితులవుతున్నారని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. మార్పుకు సమయం ఆసన్నమైందని ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే కోయంబత్తూరులో జరిగిన ఆరెస్సెస్ అఖిలభారతీయ సమావేశాల్లోనూ తమిళనాట పార్టీ విస్తరణపై చర్చ జరిగినట్లు సమాచారం. జూన్‌లో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా తమిళనాడులో రెండ్రోజులు పర్యటించి పార్టీ విస్తరణకు బీజం వేశారు. కాగా, ఎన్డీయేలో అన్నా డీఎంకే చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి. పార్టీలోని రెండు వర్గాలు ఈ అంశంపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. సీఎం పళనిస్వామితో ఓ సీనియర్ కేంద్ర మంత్రి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
రజినీకాంత్‌పై బీజేపీ నమ్మకం
బీజేపీ జాతీయ నాయకత్వం, ఆరెస్సెస్ విస్తృతంగా ప్రయత్నిస్తున్నప్పటికీ రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపే సమర్థుడైన నేత లేకపోవటం బీజేపీకి పెద్ద అవరోధంగా మారింది. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇమేజీని పార్టీ విస్తరణకు వాడుకోవాలనుకుంటోంది.రజినీ సొంతంగా పార్టీ పెట్టినా బీజేపీకి అనుబంధంగానే ఆ పార్టీ ఉంటుందని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, రజినీ సన్నిహితుడు గురుమూర్తి చెప్పటం గమనార్హం.
ద్రవిడ పార్టీలు పాతుకుపోయిన తమిళనాడులో చొచ్చుకుపోవటం బీజేపీకి అంత సులువేం కాదు. దీనికితోడు హిందీ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నచోట.. ఉత్తరాది పార్టీగా ముద్ర ఉన్న బీజేపీకి అనుకూల వాతావరణం ఉండదు. అందుకే బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అన్నాడీఎంకేలో చీలికను అడ్డంపెట్టుకుని రాష్ట్ర వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటోంది. వీలున్నపుడల్లా తన పార్టీ విస్తృతిని పెంచుకోవాలని యత్నిస్తోంది.