శాంతినివ్వని సంపద..! | Pablo Escobar The Life And Death Of A Drug Lord | Sakshi
Sakshi News home page

తానో ‘రాబిన్‌ హుడ్‌’ గా భావించాడు..

Published Fri, Sep 9 2016 11:22 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

శాంతినివ్వని సంపద..! - Sakshi

శాంతినివ్వని సంపద..!

ఎనిమిదేళ్ల వయసులో ‘మాన్యుయేలా’ ఓ వింత కోరిక కోరింది. పుస్తకాల్లో మాత్రమే కనిపించే రెక్కల గుర్రంతో ఆడుకోవాలని ఉందని చెప్పింది. ‘పాబ్లో ఎస్కబార్‌’కు కూతురంటే ప్రాణం. తన కోసం ఏదైనా చేయాలనుకుంటాడు. అతడు తలచుకుంటే చేయగలడు కూడా. రెక్కల గుర్రాన్ని కూడా అలాగే తెప్పించాడు..! అది చూసిన చిన్నారి మాన్యుయేలా మురిసిపోయింది. లవ్యూ డాడీ.. అంటూ తండ్రిని గట్టిగా హత్తుకుంది. ఆమెకు తెలీదు, అది మామూలు గుర్రమేనని.. ఎస్కబారే దాని వీపుపై రెక్కలను అతికించాడనీ..! మాన్యుయేలా కోరుకున్నవన్నీ అందించగలడు ఎస్కబార్‌. ఒక్క శాంతియుత జీవితాన్ని తప్ప! అవును.. అతనో డ్రగ్‌లార్డ్‌..!!

చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ, వందల ఎకరాల విశాలమైన ఇల్లు, ఒక్కరోజులో లెక్కపెట్టడం సాధ్యం కానంత సంపద, ప్రభుత్వాలనే గడగడలాడించే నెట్వర్క్‌.. ఇవేవీ పాబ్లో ఎస్కబార్‌కు పెద్దగా సంతృప్తిని ఇవ్వవు. తన పిల్లలిద్దరితో ఆడుకోవడం కంటే మరేదీ అతనిని సంతోషపరచదు. కానీ, ఎస్కబార్‌ది విచిత్రమైన పరిస్థితి. చేతినిండా డబ్బు ఉండాలనుకుంటాడు. అది చేతులనే విరిచేసేంత బలమైనదైనా సరే.. తనతోనే ఉండాలనుకుంటాడు. అందుకోసం చేయకూడని పనులెన్నో చేస్తాడు. దొంగ లాటరీ టికెట్లు అమ్మడం, కిడ్నాప్‌లు, డ్రగ్స్‌ సరఫరా చేయడం.. ఇలా ఏవేవో చేస్తాడు.

సంపాదనంతా తన పిల్లల కోసమే అని చెప్పుకొని మరీ సంపాదిస్తాడు. ఎంత సంపాదిస్తాడో తెలుసా..? చిన్న చిన్న దేశాల ప్రభుత్వాలు కూడా కూడబెట్టలేనంత! రోజుకు 70 మిలియన్‌ డాలర్లు.. కొందరి లెక్కల ప్రకారం ఏడాదికి 21 బిలియన్‌ డాలర్ల పైమాటే! కుప్పలు తెప్పలుగా వచ్చిపడే సొమ్మును కట్టకట్టేందుకే వారానికి వెయ్యి డాలర్లు ఖర్చు చేస్తాడట. అది కూడా రబ్బరు బ్యాండుల కోసం! ఎంత సంపదో కదా..!
కొలంబియాలోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు పాబ్లో ఎస్కబార్‌. ఏడుగురు సంతానంలో ఒకడు. చిన్నతనంలో పాఠశాలకు సరిగ్గా వెళ్లేవాడు కాదు. ఎక్కడెక్కడో తిరిగేవాడు. చెడు సావాసాలు అప్పుడే అలవాటయ్యాయి. ఖర్చులకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడం లేదనే సాకుతో దొంగ లాటరీ టికెట్లు అమ్మడం మొదలుపెట్టాడు. దొంగచాటుగా మత్తుపదార్థాలు నింపిన చుట్టలు, సిగరెట్లు కూడా అమ్మేవాడు. ఇవి చాలవన్నట్టు ఎవరిదైనా కారో, బైకో కనిపించడం చాలు.. చేతివాటం చూపేవాడు. ఇలా నేర ప్రవృత్తిని తనలో అణువణువునా నింపుకొన్నాడు.

అమెరికా అప్పటికీ ఇప్పటికీ సంపన్నదేశమే. ఆ దేశానికి మత్తుపదార్థాలు సరఫరా చేస్తే ఎక్కువ సొమ్ము సంపాదించొచ్చని తెలుసుకున్నాడు. కానీ, అది చాలా కష్టమైన పని. దొరికితే అమెరికన్‌ అధికారుల చేతిలో చావు దెబ్బలు తినాల్సిందే. ఎస్కబార్‌ ఏరోజూ దొరకలేదు. మొదట్లో కొద్దిమొత్తంలో అమెరికాకు పంపించే కొకైన్‌ను ఏకంగా రోజుకు 15 టన్నుల ఎగుమతి స్థాయికి చేర్చాడు. ఇదంతా ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే ఒక్కటే చెబుతాడు.. ‘‘సింపుల్‌..! ఇక్కడ కొంత లంచమిచ్చా.. అక్కడ కొంత. ఓ మంచి బ్యాంకర్‌ను పట్టుకున్నా. అతడికీ కాస్తంత ముట్టజెప్పా. అంతే..!’’ అంటాడు ఏమాత్రం పశ్చాత్తాపపడకుండా. తను చేస్తోంది ఘోర తప్పిదమని అతడికీ తెలుసు. కానీ, అతడికి డబ్బు కావాలి. డబ్బు తీసుకొచ్చే పేరు కావాలి.

ఈ పేరు కోసమే కొలంబియాలో ఇళ్లు కట్టించాడు, ఆసుపత్రులు నిర్మించాడు, పిల్ల్లలకు ఫుట్‌బాల్‌ కిట్లు, పాఠశాలలు, పెద్దలకు భారీ స్టేడియాలు, చర్చిలు, నిరుపేదలకు చేతి నిండా సొమ్ము, కడుపు నిండా తిండి..! చాలా చేశాడు ఎస్కబార్‌. ఎలా చేశాడన్నది అతడికి అనవసరం, ప్రజల సంగతి సరేసరి! ఎస్కబార్‌ను దేవుడిలా చూశారు స్థానికులు. అతడికి నీరాజనాలు పట్టారు. కొలంబియాలోని ఓ రోమన్‌ కేథలిక్‌ చర్చిలో అతడికి బాగా పలుకుబడి వచ్చింది. ఎస్కబార్‌ కోరుకునేదీ అదే! తానో ‘రాబిన్‌ హుడ్‌’నని భావిస్తాడాయన. ఎంతచేసినా అక్రమం సక్రమం కాబోదు. కాలేదు కూడా..!

అప్పటివరకూ చూసీ చూడనట్టు ఊరుకున్న కొలంబియా ప్రభుత్వానికి ఎస్కబార్‌పై పట్టలేనంత కోపమొచ్చింది. కానీ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే.. కొలంబియా కంటే ఎస్కబార్‌ పెద్దవాడు. అతడి స్థాయి, శక్తి పెద్దది. అతడిని ఒంటరిగా ఓడించడం కష్టం. ఇరవై ఏళ్లలో అతడో మహావృక్షమై కూర్చున్నాడు. అందుకే అమెరికా సాయమడిగింది కొలంబియా. అగ్రరాజ్యానికీ ఎస్కబార్‌తో తలనొప్పే. ఎంత నియంత్రించాలనుకున్నా తమ దేశంలోకి కొకైన్‌ను పంపుతూనే ఉన్నాడు మరి! ఒక్క అమెరికా ఏం ఖర్మ? అప్పటికి ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మత్తుపదార్థాల వ్యాపారం ఒక్క ఎస్కబారే నిర్వహించేవాడంటే అతడు ఏ స్థాయిలో అక్రమ వ్యాపారాలు చేసేవాడో తెలుసుకోవచ్చు.

ఇక అతడిని ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది అమెరికా. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ధనవంతుణ్ని మట్టుబెట్టాలని తుపాకులు ఎక్కుబెట్టింది. అయితే, అదేమంత సులభం కాలేదు. రెండు దేశాలు కలిసి ఓ ఆపరేషన్‌ నిర్వహిస్తే పాబ్లో ఎస్కబార్‌ను అంతమొందించడానికి ఏడాది పట్టింది. ఎంత సంపాదిస్తేనేం.. దిక్కులేని చావుచచ్చాడు! అక్రమ మార్గా ల్లో సంపాదన ఎన్నటికైనా చేటేనని ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చేలా చేశాడు.

కొసమెరుపు
డ్రగ్‌లార్డ్, కొకైన్‌ కింగ్‌గా చరిత్రకెక్కిన పాబ్లో ఎస్కబార్‌ చావుకు కూడా ముందు చెప్పుకున్న పుత్ర వాత్సల్యమే కారణం. తన కుమారుడితో ఫోన్లో సంభాషిస్తూ నిఘా వర్గాలకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ సంభాషణలో ఎస్కబార్‌ ఏం చెప్పాడో తెలుసా..? తాను ప్రభుత్వానికి లొంగిపోవాలనుకుంటున్నానని..!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement