
నాలుగు రోజుల్లో 700 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. ఆయన ప్రతాపానికి గత నాలుగు రోజుల్లో దాదాపు 700 మంది మృత్యువాత పడ్డారని ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. నౌకాశ్రయ నగరమైన కరాచీలో అత్యధికంగా మృతి చెందారని చెప్పారు. ఇప్పటికే దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితిని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో భానుడి ప్రతాపంపై మంగళవారం ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
దేశంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు జాతీయ విపత్తు నిర్వహాణ సంస్థకు బాధ్యతలు అప్పగించాలని ఈ సమావేశంలో ఉన్నతాధికారులకు నవాజ్ షరీఫ్ సూచించారు. అయితే భానుడి దెబ్బకు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులను సింధు ప్రభుత్వం ప్రకటించింది. భానుడి దెబ్బకు గత శుక్రవారం నుంచి సింధు ప్రావిన్స్ వ్యాప్తంగా మొత్తం 27000 మంది ఆసుపత్రి పాలైయ్యారని చెప్పారు. దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందని.... ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు.