ఉడీ ఉగ్రదాడిలో కూడా ఇంతమంది చనిపోలేదు: ఆజాద్
పాక్ ఉగ్రవాదులు ఉడీలో సైనిక శిబిరంపై దాడిచేసి, భారత సైనికులను దారుణంగా హతమార్చిన విషయమై రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేయడంలో ప్రభుత్వ తప్పుడు విధానం వల్ల ఇప్పుడు చనిపోతున్నవారిలో సగం మంది కూడా ఉడీ ఉగ్రదాడిలో మరణించలేదని గులాం నబీ రాజ్యసభలో వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి సమాధానం చెప్పేవరకు సభను నడవనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకవైపు కొంతమంది ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో గులాం నబీ ఏమన్నారో సరిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
కానీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాత్రం ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు జాతిని అవమానిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఘటనను పాక్ ఉగ్రవాద దాడులతో ఆయన పోలుస్తున్నారని.. అందుకు ఆయన క్షమాపణ చెప్పి తీరాలని, ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే తాను రికార్డులు పరిశీలించి తగిన చర్య తీసుకుంటానని సభాధ్యక్షుడు పీజే కురియన్ చెప్పారు. వెంకయ్య వ్యాఖ్యలతో మరింత ఆగ్రహానికి గురైన గులాం నబీ ఆజాద్.. ''మీరు పాకిస్థాన్లో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లి వచ్చి, వాళ్లకు రెడ్ కార్పెట్లు పరుస్తారు, మీరు మాకు చెబుతారా.. పాకిస్థాన్ కాల్పులకు ప్రతిరోజూ గురయ్యే రాష్ట్రానికి చెందినవాడిని నేను. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు'' అని ఆయన అన్నారు. అయితే వెంకయ్య నాయుడు మాత్రం తన వాదనకు కట్టుబడి ఉండి.. గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, ఆయన క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. ఈ గందరగోళం నడుమ రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది.