మర్మాంగం కోసి.. కళ్లు పీకి
లాహోర్: ఓ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ అబ్బాయి(15) మర్మాంగాన్ని కోసి, కళ్లను పీకేసిన ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో చోటుచేసుకుంది. బాలుని కుటుంబ సభ్యులు నిందితుల్ని అరెస్టు చేయాలని లాహోర్‌లో మంగళవారం ధర్నా చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత ఫిబ్రవరిలో స్థానికంగా తొమ్మిదో తరగత చదువుతున్న అబ్బాయిని అమ్మాయి తండ్రి తన అనుచరులతో కలిసి స్కూల్ నుంచి కిడ్నాప్ చేశాడు. తన కుమార్తెతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడన్న అనుమానంతో అతని మర్మాంగాన్ని కోసేయడమే కాకుండా కళ్లను పీకేసి పరారయ్యాడు. దారిన వెళ్లేవారు ఆ బాలుడిని గమనించి ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స అందించిన వైద్యులు బాలుడి ప్రాణానికి ప్రమాదం లేకపోయినా చూపు కోల్పోయాడని తెలిపారు.
పాకిస్తాన్‌లో అధికార పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) నేత ఒకరు నిందితుడికి మద్దతుగా ఉన్నారని బాలుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు లాహోర్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ హైదర్ అష్రఫ్ మాట్లాడుతూ.. అయిదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.