కశ్మీర్‌పై హినా రబ్బానీ ఖర్ వ్యాఖ్యలు
కశ్మీర్ వివాదంపై పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి హినా రబ్బానీ ఖర్ తాజాగా స్పందించారు. యుద్ధం ద్వారా కశ్మీర్ పాకిస్థాన్ సాధించుకోలేదని, భారత్-పాక్ మధ్య చర్చల ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. జీయో న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. ఇరుదేశాల మధ్య అత్యంత వివాదాస్పద అంశమైన కశ్మీర్ అంశంపై చర్చలు ఉమ్మడి విశ్వాసం ఉన్నప్పుడు సాధ్యపడుతాయని పేర్కొన్నారు.
‘కశ్మీర్‌ను యుద్ధం ద్వారా పాకిస్థాన్ సాధించుకోలేదని నేను భావిస్తున్నా.. యుద్ధం చేయనప్పుడు చర్చలే మనకున్న ప్రత్యామ్నాయం. చర్చలు జరగాలంటే అందుకు ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు, పరస్పర విశ్వాసం ఉండాల్సిన అవసరముంది’ అని ఆమె పేర్కొన్నారు.
అప్పుడు మాత్రమే పరిష్కారం!
భారత్‌లో బీజేపీ ప్రభుత్వం, పాకిస్థాన్‌లో సైనిక ప్రభుత్వం ఉన్నప్పుడే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కొందరు విశ్వసిస్తున్నట్టు ఆమె చెప్పారు. సైన్యం భాగస్వామిగా ఉన్న దౌత్య అంశాలపై పాకిస్థాన్ సైనిక ప్రభావం తప్పకుండా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.