లఖ్వీని విడుదల చేయండి
ఇస్లామాబాద్: 2008 ముంబైపై దాడిలో కీలక సూత్రధారి లఖ్వీ నిర్బంధం అక్రమమని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అతడిని జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మీడియా కథనాన్ని వెలువరించింది. తనను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని లఖ్వీ చేసుకున్న అభ్యర్థను ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూరుల్ హక్ పరిగణలోకి తీసుకుని... ఈ తీర్పు వెలువరించారు. అయితే లఖ్వీ గతంలో ఇదేవిధంగా చేసుకున్న అభ్యర్థను హైకోర్టు తోసిపుచ్చిన విషయం విదితమే.
2008 నవంబర్లో భారత వాణిజ్య రాజధాని ముంబైపై దాడి కేసులో లఖ్వీ ప్రధాన సూత్రధారి అన్న విషయం తెలిసిందే. 2009 ఫిబ్రవరిలో లఖ్వీతోపాటు మరో ఆరుగురిని పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన ఆరుగురిని అడియాల జైలులో నిర్బంధంలో ఉన్నారు. దాడి జరిగిన సమయంలో తీవ్రవాద సంస్థ లష్కరే ఈ తోయిబాకు లఖ్వీ అపరేషనల్ హెడ్గా ఉన్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముంబైలో 28/11 దాడిలో 166 మంది మరణించిన సంగతి తెలిసిందే.