'టీచర్ చేతిలో పేలిన తుపాకీ.. విద్యార్థి బలి'
పెషావర్: పాఠశాలలోని స్టాప్ రూంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ఉపాధ్యాయుడి తీరు ఒక విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. తన పిస్తోల్ను అతడు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలి పన్నేండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పాకిస్థాన్ లోని పెషావర్ లో చోటుచేసుకుంది. అదేంటి ఉపాధ్యాయుడి చేతిలో తుపాకీ అనుకుంటున్నారా.. ! గత డిసెంబర్లో పాక్ లోని పెషావర్ పాఠశాలపై ఉగ్రవాదులు విరుచుకుపడి 132 మందిని బలితీసుకున్న అనంతరం అక్కడి ఉపాధ్యాయులకు తమతో తుపాకీలు పాఠశాలలకు తీసుకెళ్లే అనుమతినిచ్చింది.
అందుకోసం వారికి జనవరిలో శిక్షణ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రోజువారిగా తుపాకీ తెచ్చుకుంటున్న మజీద్ ఖాన్ అనే టీచర్ దానిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి వరండా గుండా దూసుకెళ్లి పన్నెండేళ్ల విద్యార్థికి తగిలింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రతి ఒక్క పాఠశాలకు పోలీసు గార్డులను ఏర్పాటుచేయలేని కారణంగా ఉపాధ్యాయులకే పాక్ తుపాకీలు ఇచ్చింది.