కేంద్ర మంత్రుల కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ: చెరకు రైతులకు శుభవార్త. వారి బకాయిల చెల్లింపు కోసం బ్యాంకుల ద్వారా రూ. 7200 కోట్ల వడ్డీరహిత రుణాలను చెరకు మిల్లులకు ప్రభుత్వం అందజేయాలనుకుంటోంది. చెరకు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ అధ్యక్షతన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీ శుక్రవారం ఈ మేరకు సిఫారసు చేసింది. 4 మిలియన్ టన్నుల ముడి పంచదారను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు, బఫర్ స్టాక్ ఏర్పాటుతో పాటు చెరకు మిల్లులు గతంలో తీసుకున్న రుణాల పునర్వ్యవస్థీకరణను కూడా కమిటీ తమ సిఫారసుల్లో చేర్చింది. అలాగే, పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ను 10 శాతానికి పెంచింది.
కమిటీ సిఫారసుల వివరాలను పవార్ విలేకరులకు తెలిపారు. బ్యాంకులు ఇచ్చే రూ. 7200 కోట్ల వడ్డీరహిత రుణం మొత్తాన్ని చెరకు బకాయిల చెల్లింపు కోసమే వాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బ్యాంకులకు చెల్లించే వడ్డీని కేంద్రప్రభుత్వం, సుగర్ డెవలప్‌మెంట్ ఫండ్(ఎస్‌డీఎఫ్) భరిస్తాయని, 5 ఏళ్లలోగా బ్యాంకు రుణాన్ని మిల్లులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. గత మూడేళ్ల సగటు ఎక్సైజ్, సెస్ సుంకం చెల్లింపు ఆధారంగా మిల్లులకు బ్యాంకులు రుణాలిస్తాయని వెల్లడించారు. తమ సిఫారసులపై తుది నిర్ణయం రెండు, మూడు వారాల్లో కేబినెట్ తీసుకుంటుందన్నారు. చెరకు కొనుగోలుకు అధిక ధర చెల్లించాల్సి రావడంతో పంచదార పరిశ్రమ రైతులకు దాదాపు రూ. 3400 కోట్లు అప్పు పడి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది.
చెరకు రైతుల బకాయిలకు రూ. 7200 కోట్లు
Published Sat, Dec 7 2013 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement
Advertisement