న్యూఢిల్లీ: ఆహార భద్రత ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో ఆమోదింపజేయించడానికే యూపీఏ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని కాంగ్రెస్ తెలిపింది. ‘ఆహార భద్రత బిల్లుకు మేం పెద్ద పీట వేస్తాం. అన్ని పార్టీలూ దీనికి సహకరించాలని కోరుతున్నాం. గతంలో జరిగిన సమావేశాల కంటే ఈ సమావేశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నాం’ అని పార్టీ ప్రతినిధి మీమ్ అఫ్జల్ సోమవారమిక్కడ విలేకరులతో అన్నారు. కాగా సోమవారం లోక్‌సభలో ఓ పక్క ఆంధ్రప్రదేశ్ విభజనపై గందరగోళం నెలకొన్న సమయంలోనే ఆహార మంత్రి కె.వి.థామస్.. ఆహార భద్రత ఆర్డినెన్స్‌ను ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ ఓ ప్రతాన్ని సభకు అందించారు.
బడ్జెట్ సమావేశాల్లో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగడం వల్లే దీన్ని తీసుకొచ్చామన్నారు. ప్రజల మేలు కోసం ఉద్దేశించిన బిల్లు ఆలస్యం కాకూడదని ప్రభుత్వం భావించిందని, సభ సమావేశాలు లేని సమయంలో ఆర్డినెన్స్ తెచ్చిందని చెప్పారు. కాగా, ఈ ఆర్డినెన్స్‌ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశముందని అధికారవర్గాలు చెప్పాయి. లోక్‌సభ ఆమోదించాక ఈ వారాంతంలోనే రాజ్యసభలో ప్రవేశపెడతారని సమాచారం.
రైతు ప్రయోజనాలను కాపాడితేనే మద్దతు: ములాయం
రైతుల ప్రయోజనాలు కాపాడతామని కేంద్రం భరోసా ఇస్తే ఆహార భద్రత బిల్లుకు మద్దత్విడానికి తాము సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ అన్నారు. యూపీ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ సస్పెన్షన్ వ్యవహారంపై సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రధానికి సోనియా గాంధీ లేఖ రాసిన నేపథ్యంలో ములాయం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, ఆహార బిల్లు రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని, అవసరమని భావిస్తే పార్లమెంటులో దీనికి వ్యతిరేకంగా ఓటేస్తామని సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ చెప్పారు. బిల్లు పేరుతో ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు అమ్మేస్తారన్నారు.
ఆహార ఆర్డినెన్స్‌కే తొలి ప్రాధాన్యం: కాంగ్రెస్
Published Tue, Aug 6 2013 1:48 AM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM
Advertisement