
చంద్రబాబుతో మాట్లాడుతున్నాం.. మీరు కూర్చోండి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ సీపీ ఎంపీల ఆందోళనలు నేడు కూడా కొనసాగాయి. శుక్రవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగిన వైఎస్సార్ సీపీ ఎంపీలు.. సభ ప్రారంభమైన తర్వాత హోదా నినాదాలు చేశారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం ప్రశ్నోత్తరాలను యథావిథిగా కొనసాగించారు. దీంతో అరుపులు, నినాదాల మధ్యే సభ కొనసాగుతున్నది.
కాగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ మధ్యలో కలుగజేసుకుంటూ.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇదివరకే ప్రకటించినట్లు కేంద్రం ఏపీకి ఇచ్చిన అన్ని హమీలు నిరవేర్చుతుందని, ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరుపుతున్నామని, దయచేసి మీరు(వైఎస్సార్ సీపీ ఎంపీలు) ఆందోళన విరమించి, స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. 'కూర్చోమని నేను కూడా చెప్పాను. కానీ వాళ్లు వినడంలేదు'అని స్పీకర్ వైఎస్సార్ సీపీ ఎంపీలను ఉద్దేశించి మంత్రికి చెప్పారు. విరణతో సంతృప్తి చెందని వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుకలు హోదా నినానాదాలు కొనసాగించారు. ఉదయం గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు.