జీఎస్‌టీ... బిజినెస్‌ షురూ! | 'Party's over' for millions as India launches biggest- ever tax reform | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ... బిజినెస్‌ షురూ!

Published Fri, Jun 30 2017 12:27 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

జీఎస్‌టీ... బిజినెస్‌ షురూ! - Sakshi

జీఎస్‌టీ... బిజినెస్‌ షురూ!

ఇన్వాయిస్‌లు, రిటర్న్‌లకే ఏటా రూ.20వేల కోట్లు
ఐటీ సంస్థలు, ట్యాక్స్‌ కన్సల్టెంట్లకు కొత్త అవకాశాలు
సొల్యూషన్లతో రంగంలోకి 34 మంది సువిధ ప్రొవైడర్లు
సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిలో ఐటీ; శాప్, ఒరాకిల్‌ నిపుణులకు గిరాకీ
3 నెలల్లో లక్షకు పైగా ఉద్యోగుల అవసరముంటుందని అంచనా
జీఎస్‌టీ ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులతో స్టార్టప్స్‌ రంగంలోకి


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఎస్‌టీగా పిలుస్తున్న వస్తు సేవల పన్ను శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతోంది. కొన్నింటి ధరలు పెరుగుతున్నాయి.. మరిక్నొం టివి తగ్గుతున్నాయి. రోజువారీ అవసరమయ్యే సేవలు, వస్తువుల రేట్లు పెరుగుతుండటంతో మొత్తమ్మీద జీఎస్‌టీతో సామాన్యులకు భారమేనన్నది అత్యధికుల మాట. సామాన్యులకే కాదు!! చిన్న చిన్న వ్యాపారాలకు, మధ్య స్థాయి కంపెనీలక్కూడా ఇది భారమే. ఎందుకంటే పన్నుల నిర్వహణకు, ఐటీకి వారు పెట్టాల్సిన ఖర్చు పెరగబోతోంది. ఈ ఖర్చు... రూ.20వేల కోట్ల వ్యాపారాన్ని కూడా సృష్టిస్తోంది మరి!!:

జీఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌ విక్రయించడానికి, ఐటీ సేవలందించడానికి 34 సంస్థలు సిద్ధమయ్యాయి. జీఎస్‌టీ లావాదేవీలు, పన్ను చెల్లింపుల నిర్వహణ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిలో ఇప్పటికే పలు కంపెనీలు నిమగ్నమయ్యాయి. గ్రామాల్లోని చిన్న చిన్న వ్యాపారాలూ జీఎస్‌టీ పరిధిలోకి వస్తుండటంతో వాటికి సేవలందించటానికి స్థానిక యువత శిక్షణకు వెళుతున్నారు. పలు సంస్థలు ఇప్పటికే జీఎస్‌టీ శిక్షణ కోర్సులు మొదలెట్టగా... ఇంకొన్ని ఆన్‌లైన్‌ కోర్సులు కూడా ఆరంభించేశాయి. ఇదీ... జీఎస్‌టీ చుట్టూ అల్లుకున్న కొత్త వ్యాపార ప్రపంచం.

అసలు జీఎస్‌పీలు ఏం చేస్తాయి?
జీఎస్‌పీ... అంటే జీఎస్‌టీ సువిధ ప్రొవైడర్లు. ఇవి పన్ను రిజిస్ట్రేషన్, చెల్లింపులకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, దాన్ని థర్డ్‌ పార్టీ పన్ను చెల్లింపుదారులకు, ట్యాక్స్‌ కన్సల్టెంట్లకు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు విక్రయిస్తాయి. వ్యాపారుల నమోదు, క్రయవిక్రయాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ ఇన్వాయిస్‌ పొందుపర్చడం, ప్రతి నెలా, వార్షిక పన్ను రిటర్ను దాఖలు చేయటం కూడా వీటిపని. సువిధ ప్రొవైడర్లలో ఒకటైన టాలీ సొల్యూషన్స్‌.. ‘టాలీ.ఈఆర్పీ9 రీలీజ్‌ 6’ జీఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసింది. జీఎస్‌టీ కన్నా ముందు 11 లక్షల మంది యూజర్లున్న తమకు.. జీఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌తో సబ్‌స్క్రిప్షన్‌ 6 రెట్లు పెరిగినట్లు కంపెనీ చెబుతోంది. మరో సువిధ ప్రొవైడర్‌ జోహో.. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ‘జోహో ఫైనాన్స్‌ ప్లస్‌’ను విడుదల చేసింది. 10 వేల మంది వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నామని కంపెనీ చెబుతోంది. మరో జీఎస్‌పీ ట్యాక్స్‌మాన్‌..‘‘వన్‌ సొల్యూషన్‌’’ పేరిట సాఫ్ట్‌వేర్‌ను తెచ్చింది.

అప్లికేషన్‌ సేవలందించేవారు కూడా...
జీఎస్‌పీలే కాకుండా క్లియర్‌ ట్యాక్స్, జెనిసిస్‌ వంటి అప్లికేషన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లూ (ఏఎస్‌పీ) జీఎస్‌టీ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇవి ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) సాఫ్ట్‌వేర్లను ఆధారం చేసుకొని పన్ను చెల్లింపుదారుల క్రయ విక్రయాల డేటాను సేకరించి... జీఎస్‌టీ రిటర్న్‌కు బదలాయించి పన్నులు దాఖలు చేస్తాయి. వీటి ధరలు రూ.2,700 నుంచి ఉన్నాయి.

జీఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌ ధర రూ.18–54 వేలు!
జీఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌ ధరలు సేవలను బట్టి మారుతున్నాయి. ‘‘ఆదాయ పన్ను రిటర్న్‌ (ఐటీఆర్‌), ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌ (టీడీఎస్‌), ఆడిట్‌ రిపోర్ట్, జీఎస్‌టీ వంటివన్నీ ఉంటే ఏడాదికి రూ.19 వేలు చార్జీ ఉంటుంది. కేవలం వన్‌ సొల్యూషన్‌కైతే ఏడాదికి రూ.8,500’’ అని ట్యాక్స్‌మాన్‌ సీఈఓ పీయూష్‌ కుమార్‌ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు. 125 మంది ఐటీ నిపుణులు, 9 నెలలు శ్రమించి ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారని.. ఇప్పటికే పలు రియల్‌ ఎస్టేట్, బ్యాంకింగ్, బీమా సంస్థలు కొనుగోలు చేశాయని చెప్పారు. జీఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌తో పాటు ఉత్పత్తుల క్రయ విక్రయాల బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్, చెల్లింపుల సాఫ్ట్‌వేర్, పరిష్కారాలు, ఈ–సంతకాల వంటి వాటికైతే రూ.54 వేల వరకూ చార్జీ ఉంటుందని ఓ ఐటీ కంపెనీ ప్రతినిధి చెప్పారు. అలా కాకుండా ఒక యూజర్‌కు వార్షిక సబ్‌స్క్రిప్షన్‌కు రూ.3,600, అంతకంటే ఎక్కువ యూజర్లకైతే రూ.10,800 అని చెప్పారు. ఒక్క ఇన్‌వాయిస్‌కు 49 పైసలు నుంచి రూపాయి వరకు చార్జీ, నెలకు ఒక్క రిటర్న్‌ దాఖలుకు రూ.100–200 చార్జీలున్నాయి.

ఎంపికైన జీఎస్‌పీ సంస్థలివే..: అలంకిత్, బోధ్‌ట్రీ, సీడీఎస్‌ఎల్‌ ఇండియా, బో«ద్‌ట్రీ, సీఏఎంఎస్‌ ఆన్‌లైన్, సైజెంట్‌ ఇన్ఫోటెక్, డెలాయిట్, ఈవై, ఎక్సెలాన్‌  సాఫ్ట్‌వేర్, గోఫ్రూగల్, ఐరిస్, కార్వీ, మాస్టెక్, మాస్టర్స్‌ ఇండియా, మైండ్‌ ఇన్ఫోటెక్, ఎన్‌ఎస్‌డీఎల్, రామ్‌కో, శేషసాయి, ఎస్‌ఐఎస్‌ఎల్‌ ఇన్ఫోటెక్, స్కిల్‌రాక్, స్పేస్‌ డిజిటల్, టాలీ సొల్యూషన్స్, టీసీఎస్, ట్యాక్స్‌మాన్, టెరా సాఫ్ట్‌వేర్, ట్రస్ట్‌ సిస్టమ్స్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్, వయానా, వెలోసిస్, వెర్టెక్స్‌ గ్రూప్, వెప్‌ ఇండియా.

ఆన్‌లైన్‌లో జీఎస్‌టీ కోర్సులు..
ఆన్‌లైన్‌పన్ను చెల్లింపు సేవలు, సీఏ శిక్షణ సంస్థలు కొన్ని జీఎస్‌టీ వేదికగా సర్టిఫికెట్‌ కోర్సులను తెచ్చాయి. బెంగళూరుకు చెందిన ఇన్‌కమ్‌ట్యాక్స్‌ రిటర్న్స్, ఎంటర్‌ప్రైజ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ క్లియర్‌ ట్యాక్స్, సీఏ శిక్షణ సంస్థ హైర్‌గ్యాంగీ అకాడమీతో కలిసి జీఎస్‌టీ లాంగ్‌ టర్మ్, షార్ట్‌ టర్మ్‌ ఈ–లెర్నింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. ట్యాక్స్‌మంత్ర, సీఏక్లబ్‌ఇండియా.కామ్‌తో కలిసి బిజినెస్, ప్రొఫెషనల్స్‌ కోసం జీఎస్‌టీ సర్టిఫికేషన్‌ కోర్సును రూపొందించింది. ‘‘ఈ–లెర్నింగ్‌ కోర్సులు తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ వంటి 20 ప్రాంతీయ భాషల్లోనూ లభిస్తాయి. కోర్సుల ధర రూ.3 వేలు’’ అని సంస్థ సీఈఓ అర్చిత్‌ గుప్తా తెలిపారు. ఇప్పటికే లాంగ్‌ టర్మ్‌ కోర్సులో 20 వేల మంది సీఏలు, ట్యాక్స్‌ కన్సల్టెంట్లు నమోదయ్యారని తెలిపారు.

కళ్లు తిరిగే గణాంకాలు...
ప్రస్తుతం దేశంలో నెలకు 300 కోట్ల ఇన్వాయిస్‌లు అప్‌లోడ్‌ అవుతున్నాయి. ఒక్క ఇన్‌వాయిస్‌కు రూ.1 చార్జీ చేసినా.. నెలకు రూ.300 కోట్లు! ఏటా రూ.3,600 కోట్లు. ఇక రిటర్న్‌లు చూస్తే.. ఒక రాష్ట్రంలో ఒక్కో సంస్థ నెలవారీ 3, వార్షికంగా 1 చొప్పున ఏటా 37 రిటన్స్‌ వేయాలి. జీఎస్‌టీలో నమోదైన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 80 లక్షలు. ప్రతి సంస్థా సగటున 5 రాష్ట్రాల్లో సేవలందిస్తుందనుకుంటే... 80 లక్షలు (ఇంటు) 5=4 కోట్లు. అంటే ఏడాదికి 148 కోట్ల రిటర్న్‌లు. ఒకో రిటర్న్‌కు రూ.100 చార్జీ చేసినా.. రూ.14,800 కోట్ల వ్యాపారం.

జోరుగా కొత్త ఉద్యోగాలు!
జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనేది నిపుణుల అంచనా. ‘‘మొదటి త్రైమాసికంలో సుమారు లక్ష కొత్త ఉద్యోగుల అవసరం ఉంటుంది. తర్వాత మరో 50–60 వేల ఉద్యోగాలు కూడా వస్తాయి’’ అని గ్లోబల్‌ ఓసియన్‌ గ్రూప్‌ ఎండీ బ్రిజేశ్‌ లోహియా చెప్పారు. ట్యాక్స్‌ కన్సల్టింగ్, అకౌంటింగ్, డేటా అనాలిసిస్, కంపెనీ అకౌంట్స్, ట్యాక్సేషన్‌ విభాగాల్లో వీరి అవసరముంటుందని.. ఆయా విభాగాల్లో 10–13 శాతం వార్షిక వృద్ధి రేటు కూడా ఉంటుందని చెప్పారాయన.

జీఎస్‌టీకి సంబంధించి వివిధ సాఫ్ట్‌వేర్ల తయారీలో కంపెనీలు నిమగ్నమవటంతో ఐటీ సంస్థల్లో ఉద్యోగుల అవసరం ఏర్పడిందని ఓ కంపెనీ ప్రతినిధి చెప్పా రు. ముఖ్యంగా ఎస్‌ఏపీ, ఒరాకిల్‌ వంటి టెక్నాలజీ నిపుణులకు అపార అవకాశాలున్నాయని చెప్పారాయ న. త్వరలోనే డెలాయిట్‌ 250 మంది పరోక్ష పన్ను కన్సల్టెంట్లను, పీడబ్ల్యూసీ 200–250 సీఏ, సిస్టమ్‌ ఎగ్జిక్యూటివ్‌లనూ నియమించుకోనుందని తెలిపారు.

జీఎస్‌టీ పరిధిలోకి వచ్చిన 80లక్షల మందిలో 80 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలే(ఎస్‌ఎంఈ). ‘‘నిరక్షరాస్యత, ఆన్‌లైన్‌ అలవాటు లేకపోవటం వంటి కారణాల వల్ల స్థానికంగా ఉండే యువతకు, కంప్యూటర్‌ మీద పట్టు, పన్ను చెల్లింపుల్లో అవగాహన ఉన్న వారికి ఉపాధి దొరుకుతుంది’’ అని పీయూష్‌ కుమార్‌ చెప్పా రు. చాలా కంపెనీలు జీఎస్‌టీ నిర్వహణ కోసం థర్డ్‌పార్టీ మీద ఆధారపడతాయి. దీంతో ఆయా సంస్థల్లోనూ డేటాఎంట్రీ, పన్ను చెల్లింపుల నిర్వహణకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలుంటాయని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement