లోకల్ రైలులో పండంటి బిడ్డకు ప్రాణం
ముంబయి: అది ముంబయి లోకల్ రైలు. రద్దీ జనం.. రైలు వేగంగా వెళుతోంది. ఇంతలో నిండు గర్భిణీ ప్రసవ వేదన. పురిటి నొప్పులతో అరుపులు. ఆ బోగీలో ఉన్నవారంతా ఒక్కసారిగా పక్కబోగిలోకి తోసుకుంటూ వెళ్లిపోయారు. కనీసం జాలి కూడా లేకుండా మహిళలు సైతం ఆమెను పట్టించుకోకుండా దూరంగా జరిగిపోయారు. పక్కబోగీలోకి జనాలు ఉన్నపలంగా వస్తూ ఉండటం చూసి అందులో ఉన్న ఇక్బాల్ అన్సారీ అనే జర్నలిస్టు ఏం జరుగుతుందబ్బా అని వెళ్లి చూశాడు. రక్తపు మరకలు.. చేతిలో పండంటి బిడ్డతో రామ్ లాల్ అనే ఓ తండ్రి. ఓ బిడ్డను ప్రసవించి ఓ మూలగా కూర్చున్న అతడి భార్య సుదేవి.
ఆ దృశ్యం చూసి ఇక్బాల్ గుండె తరుక్కుపోయింది. చుట్టుపక్కల ఉన్నవారిపై కొంత కోపం వచ్చినా.. వెంటనే రైల్వే హెల్ప్లైన్ నెంబర్ 1276కు ఫోన్ చేశాడు. అది కలవకపోవడంతో వెంటనే అనే మరో రైలు సర్వీసు నెంబర్ 9833331111కు ఫోన్ చేసి విషయం వివరించాడు. కంజుర్ మార్గ్ స్టేషన్ వద్దకు రాగానే చైన్ లాగి రైలును ఆపేశాడు. వెంటనే అక్కడి చేరుకున్న రైల్వే సిబ్బంది స్ట్రెచర్తో వచ్చారు. ఆ సమయంలో తోటివారు కూడా ఇక్బాల్ సేవాగుణంతో ప్రభావితమై సహాయ చర్యలు ప్రారంభించారు. అందరూ కలిసి ఆమెను, బాలుడిని సురక్షితంగా తీసుకెళ్లి ఆస్పత్రికి తరలించారు. ఇక్బాల్ సేవకు దంపతులు ధన్యవాదాలు తెలిపారు.