
పార్లమెంట్ హాల్‌లో అడుగుపెడతాననుకోలేదు
వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్
హన్మకొండ: ‘పార్లమెంట్ దగ్గరికి వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఉద్యమంలో భాగంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపినా కిలోమీటర్ దూరం నుంచి పార్లమెంట్‌ను చూశా. అలాంటిది ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పార్లమెంట్‌లో అడుగు పెట్టే అవకాశం కలిగింది.’ అని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఆదివారం ఆయన హన్మకొండలో విలేకరులతో మాట్లాడుతూ సామాన్యుడినైన తనకు కేసీఆర్ టికెట్ ఇచ్చారని, ప్రజలు ఎంపీని చేశారన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి జిల్లాకు నిధులు తెస్తానన్నారు.