
'ప్రజలు ఏపీ ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారు'
హైదరాబాద్: రెండున్నరేళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజలంతా ఏపీ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యకాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం తొలిదశలోనే విజయం సాధించిందని చెప్పారు.
మరో నెల రోజుల తర్వాత మరోసారి సమీక్ష ఉంటుందని అన్నారు. ప్రతి గ్రామంలోని గడపగడపకు తాము వెళ్లామని, ప్రజల అవసరాలు, వారికి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలుసుకున్నామని వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా, ప్రభుత్వ వైఫల్యాలపై తీసుకొచ్చిన ప్రజా బ్యాలెట్ ను వారికి పంపిణీ చేశామని చెప్పారు. 40 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు నిక్కచ్చిగా పనిచేశారని, తాము తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి నీరాజనాలు అందుతున్నాయని అన్నారు.
ప్రజలంతా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేలా ఉన్నారని, వారు పూర్తి అసంతృప్తితో రగులుతున్నారని, మహిళలు శాపనార్థాలు పెడుతున్నారని వివరించారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశంపై ప్రతి ఒక్కరం సమీక్షలు తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు ఉంచామని, ఆయన ఇచ్చిన మరికొన్ని సలహాలతో తిరిగి మరో నెల రోజులపాటు విధుల్లోకి వెళుతున్నామని చెప్పారు.