
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం 2016–2019 మధ్య కాలంలో పౌర హక్కుల ఉల్లంఘన జరిగే విధంగా చట్టవిరుద్ధంగా కమ్యూనికేషన్ పరికరాల కొనుగోలు, వివిధ మార్గాల్లో డేటా చోరీకి పాల్పడినట్టు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు శాసనసభా సంఘం ఏర్పాటైంది. శుక్రవారం శాసనసభ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ సభా కమిటీ వివరాలను ప్రకటించారు. కమిటీ చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి, సభ్యులుగా ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, డాక్టర్ మేరుగ నాగార్జున, కొట్టగుళ్లి భాగ్యలక్షి, గుడివాడ అమర్నాథ్, కొఠారి అబ్బయ్యచౌదరి, మద్దాల గిరిధరరావు నియమితులయ్యారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి శాసన సభలో పెగసస్ అంశంపై ప్రసంగిస్తూ.. ఇజ్రాయెల్ కంపెనీ ఈ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేయాలని తన వద్దకు వచ్చిందని చెబుతూ అది చట్టవిరుద్ధమని తాను అంగీకరించలేదని తెలిపారు. అయితే, అప్పట్లో అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పెగసస్ సాఫ్ట్‌వేర్ తీసుకున్నారని వెల్లడించారు. ఇదే అంశంపై ఈ నెల 22న జరిగిన ఏపీ శాసనసభ సమావేశంలో దుమారం చెలరేగింది.
గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులు, సినీ, రాజకీయ పెద్దల డేటాను రహస్యంగా సేకరించేందుకు ఇజ్రాయెల్ నుంచి పరికరాలు, సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసేందుకు సభా సంఘం ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు అభ్యర్థించటంతో స్పీకర్ అందుకు అంగీకరించారు. ఇందులో భాగంగా భూమన చైర్మన్‌గా ఆరుగురు ఎమ్మెల్యేలతో కూడిన సభా సంఘాన్ని నియమించినట్లు శుక్రవారం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment