నగరం.. జన సంద్రం | People crowd flow to Samaikya sankharavam | Sakshi
Sakshi News home page

నగరం.. జన సంద్రం

Published Sun, Oct 27 2013 2:11 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

People crowd flow to Samaikya sankharavam

శంఖారావానికి పోటెత్తిన సమైక్యవాదులు.. ఎటు చూసినా జన ప్రవాహమే
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావానికి ప్రజలు పోటెత్తారు. సభ జరిగిన ఎల్బీ స్టేడియంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారిపోయాయి. చుట్టూ దాదాపు నాలుగైదు కిలోమీటర్ల మేర దాకా పరిసరాలన్నీ వైఎస్సార్‌సీపీ అభిమానులు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులతో నిండిపోయాయి. హైదరాబాద్ నగరం మొత్తం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచే మొదలైన సమైక్య సందడి శనివారం సాయంత్రం 5 గంటలకే సభ ముగిసినా రాత్రి దాకా కొనసాగింది. శనివారం ఉదయం 9 గంటల నుంచే నగరమంతటా ప్రారంభమైన రద్దీ, చూస్తుండగానే తారస్థాయికి చేరుకుంది.
  రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అభిమానుల్ని నగరానికి తీసుకుని వచ్చే వాహనాల రాక శుక్రవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. వారంతా నగరంతో పాటు శివార్లలో ఉన్న అనేక ఫంక్షన్ హాళ్లల్లో బస చేసి, ఉదయాన్నే విడతల వారీగా ఎల్బీ స్టేడియం వైపు బయల్దేరారు. విజయవాడ వైపున్న వనస్థలిపురం, దక్షిణ మండలంలో ఉన్న జూపార్కులతో పాటు కూకట్‌పల్లి తదితర మార్గాల్లో ఎక్కడ చూసినా సమైక్య సభకు వచ్చిన వాహనాలే కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి కన్పించాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన వాహనాలు పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే, మెహదీపట్నం మీదుగా నెక్లెస్ రోడ్‌కు చేరుకున్నాయి. అక్కడ నుంచి అభిమానులంతా కాలినడకన స్టేడియానికి చేరుకున్నారు. దాంతో ఆ మార్గమంతా వారితోనే పూర్తిగా నిండిపోయింది. అటు పబ్లిక్ గార్డెన్స్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ మార్గ్ తదితర చోట్ల కూడా ఉదయం 8 నుంచే సందడి మొదలైంది.
 
 9 తరవాత స్టేడియంలోకి అనుమతి...: ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ఉదయం 8 గంటల నుంచే సందడి నెలకొన్నా పోలీసులు 9 గంటల తరవాత ప్రజలను కొద్దికొద్దిగా స్టేడియంలోకి అనుమతించారు. అది 10 గంటలకల్లా ఊపందుకుంది. చూస్తుండగానే స్టేడియమంతా జనంతో నిండి కిక్కిరిసిపోయింది. ఆయకార్ భవన్ వైపున్న ‘జీ’ ఔటర్ గేట్, ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్ వైపున్న ‘ఎ’ గేటు ద్వారా పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియం ప్రాగణంలోకి ప్రవేశించారు. నిజాం కళాశాల ఎదురుగా ఉన్న ఎఫ్, ఎఫ్-1 ఔటర్ గేట్లలో ఒకటి వీఐపీలకు, మరోటి సాధారణ ప్రజలకు కేటాయించాలని తొలుత పోలీసులు భావించారు. కానీ జనసంద్రాన్ని చూసి రెండింటి నుంచీ అభిమానులనే పంపారు. వీఐపీలను కూడా వారితో పాటే స్టేడియంలోకి అనుమతించారు. ప్రాంగణంలోని ఇన్నర్ గేట్ 6ను మాత్రం వీఐపీలకే ప్రత్యేకంగా కేటాయించారు. మధ్యాహ్నం ఒంటి గంటకే స్టేడియం కిక్కిరిసిపోవడంతో లోపలకు వెళ్లే అవకాశం లేక భారీ సంఖ్యలో అభిమానులు, కార్తకర్తలు గేట్ల వద్దే నిలిచిపోయారు.
 
 

లోనికెళ్లే అవకాశం లేదని గ్రహించి, చుట్టుపక్కల రోడ్లలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరల వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు. లోపల వేదికపై సాంసృ ్కతిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఓ సందర్భంలో వర్షం కురిసింది. అయినా ఎల్‌ఈడీల వద్ద గుమిగూడిన అభిమానులు ఒక్కరు కూడా కదల్లేదు. మొక్కవోని అభిమానంతో అక్కడే ఉండి తమ ప్రియతమ నేత జగన్ రాక కోసం ఎదురుచూశారు. వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఉన్న ‘సి’ గేట్‌ను జగన్, ఆయన కుటుంబీకుల కోసం కేటాయించినట్టు పేర్కొంటూ అక్కడ ఫ్లెక్సీని పోలీసులు ఏర్పాటు చేశారు.

 

దీంతో అటు నుంచి స్టేడియంలోకి వెళ్లే జగన్‌ను చూడాలనే కోరికతో ఆ ప్రాంతంలో అభిమానులు, కార్యకర్తలు భారీగా బారులుతీరారు. శంఖారావం ప్రారంభమయ్యే సమయానికే ముందుగానే స్టేడియం జనంతో పోటెత్తిపోవడంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు కొన్ని గేట్లను మూసేశారు. అప్పటిదాకా నాలుగు ఔటర్ గేట్ల నుంచి అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులను అనుమతించిన పోలీసులు.. ఆ తర్వాత జీ, ఏ గేటు మాత్రమే తెరిచి ఉంచారు. ఎఫ్, ఎఫ్-1 గేట్లను మూసేశారు. దాంతో ఆయా గేట్ల వద్దకు వచ్చిన వారంతా ఎల్‌ఈడీ తెరల వద్దకు చేరారు. మధ్యాహ్నం మూడింటి నుంచి జీ, ఏ గేట్ల నుంచి కూడా రాకపోకలను నియంత్రించారు.
 
 ప్రతి దారీ జన ప్రభంజనమే...: కేవలం ఎల్బీ స్టేడియం, చుట్టు పక్కల ఉన్న రహదారులు మాత్రమే కాకుండా అటుకేసి దారి తీసే అన్ని మార్గాలూ కార్యకర్తలు, అభిమానులతో నిండిపోయాయి. నాంపల్లి, పోలీసు కంట్రోల్ రూమ్‌లతో పాటు ఏఆర్ పెట్రోల్ పంప్ చౌరస్తా, బీజేఆర్ స్టాట్యూ జంక్షన్, చర్మాస్ రోడ్, గన్‌ఫౌండ్రీ ఎస్‌బీహెచ్ రహదారి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మార్గం, హిమాయత్‌నగర్, లిబర్టీ, బషీర్‌బాగ్, అబిడ్స్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, బొగ్గులకుంట, తాజ్‌మహల్ హోటల్, ఈడెన్‌గార్డెన్స్, కింగ్ కోఠి తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ స్టేడియం వైపు కాలినడకన వస్తున్న వారితో నిండిపోయాయి. బీజేఆర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం, స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి లక్డీకాపూల్ వరకు ఎటు చూసినా నేల ఈనినట్టుగా జనమే! వారి వాహనాలకు కేటాయించి పార్కింగ్ స్థలాలు  చాలకపోవడంతో చాలాచోట్ల వాటిని రోడ్ల పక్కనే ఆపుకోవాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement