
‘పిల్’ నిబంధనలు మరింత కఠినం!
దుర్వినియోగం జరక్కుండా హైకోర్టు చర్యలు
* వ్యక్తిగత వివరాలన్నీ సీల్డ్ కవర్‌లో ఇవ్వాలి
* ఆదాయమార్గాలూ వెల్లడించాలి
* న్యాయవాదికిచ్చే ఫీజు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి
* మీపై ఉన్న సివిల్, క్రిమినల్, రెవెన్యూ వివాదాలనూ పేర్కొనాలి
* పిటిషనర్ ఉద్దేశాలపై ధర్మాసనానికి సందేహం వస్తే రూ.50 వేల ఎఫ్‌డీ
* రిజిస్ట్రార్ సంతృప్తి చెందితేనే పిల్‌కు నంబర్
సాక్షి, హైదరాబాద్: మీరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయాలని భావిస్తున్నారా..?
గతంలో అలా పిల్ దాఖలు చేసి.. ఇలా అనుకూల ఉత్తర్వులు పొందారా..? అయితే ఈసారి పిల్ దాఖలు చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి. నిన్నటి వరకు ఆషామాషీగా దాఖలు చేసిన విధంగానే ఇకపై పిల్ దాఖలు చేస్తామంటే కుదరదు. పిల్ దాఖలు పేరుతో న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసే వ్యక్తులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో వారికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ప్రజా ప్రయోజన వ్యాజ్య నిబంధనలు-2015ను ఉమ్మడి హైకోర్టు రూపొందించింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు విషయంలో హైకోర్టులు వాటికి తగ్గట్టు స్వీయ నిబంధనలను రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఎవరు దాఖలు చేయాలి.. ఏ రూపంలో దానిని దాఖలు చేయాలి.. ఎవరు దానిని విచారించాలి.. తదితర వివరాలను కూడా వాటిలో పేర్కొన్నారు.
ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో పాటు జత చేయాల్సిన వాటి గురించి కూడా సవివరంగా పొందుపరిచారు. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఓ అంశాన్ని సుమోటో (తనంతట తాను) పిటిషన్‌గా స్వీకరించవచ్చు. ప్రధాన న్యాయమూర్తి నియమించే పిల్ కమిటీ లేదా హైకోర్టు న్యాయమూర్తి చేసే సిఫారసుల ఆధారంగా ఓ అంశాన్ని పిల్‌గా విచారించవచ్చు.
పౌరుని నుంచైనా, న్యాయ విద్యార్థుల నుంచైనా, న్యాయవాదుల సంఘం నుంచైనా, న్యాయసేవాధికార సంస్థ నుంచైనా లేఖలు గానీ, వినతిపత్రాలు గానీ అందుకున్నప్పుడు వాటిని ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు పిల్‌గా పరిగణించి విచారించాలి.. పిల్ రూపంలో నేరుగా ఏ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌నైనా విచారించవచ్చు.
కోర్టు సందేహిస్తే రూ.50 వేలను సిద్ధం చేసుకోవాల్సిందే
పిల్ దాఖలు సమయంలో మీరు పొందుపరిచిన వివరాలు, అందించిన సమాచారం విశ్వసించదగినదిగా లేదని విచారణ సమయంలో ధర్మాసనం భావిస్తే, ఈ పిల్ దాఖలు వెనుక మీకున్న సదుద్దేశాలను నిరూపించుకోవాలని, దానికి ముందు కనీసం రూ.50 వేలను ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో రిజిస్ట్రార్(జ్యుడీషియల్) పేరు మీద జమ చేయాలని కక్షిదారుడిని ఆదేశించవచ్చు.
ధర్మాసనం తనంతట తానుగా లేదా ఆ పిల్‌లోని ఇతర పార్టీల అభ్యర్థన మేర ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు ఆదేశాలివ్వొచ్చు. తమ ముందున్న వ్యాజ్యంలో విస్తృత ప్రజా ప్రయోజనాలున్నాయని ధర్మాసనం భావిస్తే, ఏ కక్షిదారుడికైనా ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి మినహాయింపు కూడా ఇవ్వొచ్చు. ఒకవేళ ఏదైనా సంస్థ పిల్ దాఖలు చేయాలని భావిస్తే, దాని అధీకృత అధికారి, ప్రతినిధులు పిటిషనర్ అయి ఉండాలి. విచారణ సమయంలో ఆ సంస్థ అధీకృత అధికారి, ప్రతినిధి మారితే, ఆ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకురావాలి. 30 రోజుల్లో పిల్‌లో అందుకు అనుగుణంగా మార్పులు చేయాలి.
పిల్ దాఖలు చేయాలంటే...
1. పిల్ దాఖలు చేసే వ్యక్తి లేదా సంస్థ లేదా సంఘం తన వ్యాజ్యంలో పూర్తి పేరు, పోస్టల్ అడ్రస్, ఈ మెయిల్, మొబైల్ నంబర్, వ్యక్తిగత గుర్తింపునకు ఆధారం, వృత్తి, వార్షిక ఆదాయం, బ్యాంకు ఖాతా, పాన్ నంబర్, ఆధార్ నంబర్ తదితరాలను పొందుపరచాల్సి ఉంటుంది.
2. అన్ని పత్రాలపై పిటిషనర్ సంతకం చేసి, వాటిని సీల్డ్‌కవర్‌లో కోర్టు రిజిస్ట్రీ ముందుంచాలి.
3. థర్డ్‌పార్టీ ఎవరూ కూడా ఆ వివరాలను చూడకుండా ఆ సీల్డ్‌కవర్‌ను ఒరిజినల్ బండిల్‌తో జత చేయాలి.
4. పిటిషనర్ వృత్తి, అతని పూర్వ వివరాలు, తన విశ్వసనీయతకు సంబంధించిన వివరాలు, పిల్‌లో తాను లేవనెత్తిన విషయానికీ తనకూ ఉన్న సంబంధం తెలియజేయాలి
5. గతంలో కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కొన్నారా..? ఆ కేసుకు సంబంధించి ప్రస్తుత దశ, ఇతర వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది.
6. గతంలో ఏదైనా కోర్టు తదుపరి ఎటువంటి పిల్ దాఖలు చేయడానికి వీల్లేదని ఉత్తర్వులు ఇచ్చిందా..?
ఉంటే వాటి వివరాలను తెలియచేయాలి.
7. పిల్‌లో లేవనెత్తిన అంశం ఏ విధంగా ప్రజా ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందో వివరించాలి.
8. సివిల్, క్రిమినల్, రెవెన్యూ వివాదాల్లో తన పాత్ర ఏమైనా ఉంటే వాటి వివరాలు, పిల్‌లో లేవనెత్తిన అంశంపై న్యాయపరంగా తనకేమైనా సంబంధం ఉంటే దాని గురించి తెలియజేయాల్సి ఉంటుంది.
9. పిల్‌లో తాను లేవనెత్తిన అంశంలో తనకున్న జోక్యం చేసుకునే హక్కు, అర్హత గురించి వివరించాలి.
10. అన్నింటికన్నా ముఖ్యమైంది ఈ కేసు దాఖలు చేసేందుకు, న్యాయవాదికి ఫీజు చెల్లించేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, అందుకు సంబంధించిన మార్గాలను తెలియజేయాల్సి ఉంటుంది.
గమనిక: మీరు పొందుపరిచిన ఈ వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయని కోర్టు రిజిస్ట్రీ భావిస్తే, అప్పుడే మీ పిల్‌కు పూర్తిస్థాయి నంబర్ కేటాయిస్తారు. తరువాత ఆ పిల్ ధర్మాసనం ముందు విచారణకు వస్తుంది.