
తప్పతాగి వచ్చిన పైలట్లు.. ప్రయాణికులు షాక్!
345 మంది ప్రయాణికులు.. తొమ్మిది మంది సిబ్బంది.. అందరూ ఎయిర్ ట్రాన్స్‌శాట్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్‌గౌ విమానాశ్రయం నుంచి ఈ విమానం కెనడాకు వెళ్లాల్సి ఉంది. ఇంతలో పైలట్లు కూడా విమానం వద్దకు వచ్చారు. అయితే, వారు మద్యంలో మత్తులో తూలుతూ ఉండటంతో ముందుగానే పసిగట్టిన అధికారులు.. ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్నారు. 345 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బందికి పెద్ద గండాన్ని తప్పించారు. ఈ ఘటన సోమవారం గ్లాస్ గౌ విమానాశ్రయంలో జరిగింది. తాగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కెప్టెన్ జీన్ ఫ్రాంకొయిస్ పెరియల్ట్ (39), జఫర్ సయ్యద్ (37) మంగళవారం కోర్టు ముందు హాజరుపరుచగా.. ఇద్దరికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఈ ఊహించని ఘటనతో ప్రయాణికులు షాక్ తిన్నారు. సోమవారం వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా మంగళవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరింది. ఈ ఘటనపై ఎయిర్ ట్రాన్స్‌శాట్ విమానాయాన సంస్థ ప్రయాణికులను క్షమాపణ కోరింది. జరిగిన దానికి చింతిస్తూ ప్రయాణికులకు 200 కెనడియన్ డాలర్లు పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడబోమని పేర్కొంది. పైలట్లు ఇద్దరు కెనడాకు చెందిన వారని, వారిపై విచారణ జరుగుతున్నదని తెలిపింది.