పాక్ జీవనాడిపై దెబ్బ కొడదామా.. వద్దా?
న్యూఢిల్లీ: అస్థిర ప్రభుత్వాలు, ఉగ్రవాదం, అవినీతి యంత్రాంగం.. ఒక దేశానికి ఎన్ని అవలక్షణాలుండాలో అంతకుమించే ఉన్న పాకిస్థాన్ ఆర్థిక శక్తిగా కొనసాగుతుండటానికి ప్రధాన కారణం.. సింధూ నదీ జలాలు. పాక్ జీవనాడి అయిన ఈ నదీ జలాలపై 56 ఏళ్ల కిందట చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని లేదా పునఃసమీక్షించుకోవాని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం 'సింధు నదీ జలాల ఒప్పందం'పై పలువురు ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు. భేటీ అనంతరం జలవనరుల శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలు త్వరలోనే అందరికీ వెల్లడిస్తామని వ్యాఖ్యానించారు. కాగా ఇదే సమావేశంలో ప్రధాని మోదీ.. 'భారత్,పాక్ల మధ్య నెత్తురూ, నీళ్లూ ఒకేసారి ప్రవహించలేవు'అని అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
సెప్టెంబర్ 18నాటి ఉడీ ఉగ్రదాడి అనంతరం దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెబుతామని ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఆమేరకు 1960నాటి సింధూ నదీ జలాల ఒప్పందంపై దృష్టిసారించింది. సోమవారంనాటి ఉన్నతస్థాయి భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ శశిశేఖర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను తిరిగి క్యాబినెట్ భేటీలో చర్చించిన తరువాతే సింధూ జలాల ఒప్పందంపై ప్రధాని తుది నిర్ణయాన్ని వెల్లడిస్తారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని పాకిస్థాన్ తో చర్చిస్తారు.
పాక్ను మనం కొడితే.. చైనా మనని కొడుతుంది!
పాక్ జీవనాడిపై దెబ్బ కొడితే ఆ దేశం కకావికలం కావడం ఖాయం. ప్రపంచంలోనే అద్భుతమైన నీటిపారుదల వ్యవస్థల్లో ఒకటైన సింధూ డెల్టాయే పాకిస్థాన్ కు ఆదరువు. పలు ఫ్రావిన్స్ లను సస్యశామలం చేసే సింధూ నది.. కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధుతోపాటు దీని ఉపనదులైన జీలం-చినాబ్-బియాస్-రావి-సట్లెజ్ నదులపై 1960లో నాటి భారత్ పాక్ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, అయూబ్ ఖాన్ లు ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా తూర్పు నదులైన బియాస్, రావీ, సట్లెజ్ నదులపై భారత్‌కు, పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంపై పాక్‌కు నియంత్రణ లభించింది. లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తూర్పు నదులైన బియాస్, రావీ, సట్లెజ్ నదులపై భారత్‌కు, పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంపై పాక్‌కు నియంత్రణ లభించింది.
అయితే సింధూ ప్రారంభస్థానం చైనాలో ఉన్నందున భారత్ తీసుకోబోయే ఎలాంటి నిర్ణయానికైనా అడ్డుపడే అవకాశం ఆ దేశానికి ఉంది. తన ఆధీనంలోని సింధు జలాలను భారత్ లోకి రానీయకుండా చైనా అడ్డుకుంటే ప్రస్తుతం మనం వాడుకుంటున్న 36 శాతం నీళ్లు కూడా దక్కకుండా పోతాయి. అంతేకాదు తన స్నేహితుడు పాకిస్థాన్ పై భారత చర్యకు ప్రతీకారంగా చైనా బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని కూడా అడ్డుకునే అవకాశాలున్నాయి. చైనాగానీ బ్రహ్మపుత్ర జలాలను అడ్డుకుంటే తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్ ఘోరంగా దెబ్బతింటాయి. అదీగాక భారత్- పాకిస్థాన్-చైనాలు సంయుక్తంగా ఇప్పటివరకు ఎలాంటి అంతర్జాతీయ జల ఒప్పందాలు చేసుకోలేదు.
కశ్మీర్ నీట మునగటం ఖాయం
సింధూ జలాలను ఉన్నపళంగా అడ్డుకుంటే గనుక భారత్.. అంతర్జాతీయ నదీ జలాల చట్టాలను ఉల్లంఘించినట్లవుతుంది. పాక్ ను ఒంటరి చేయాలనే నిర్ణయాన్ని సమర్థించేవారి విశ్వాసాన్ని కూడా కోల్పోయేప్రమాదం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా సింధూ జలాలను సరైన పద్ధతిలో మళ్లించలేకపోతే కశ్మీర్ మొత్తం నీట మునుగుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడే నదీ జలాల అడ్డుకట్ట ఉండదు. అయితే ఒప్పందాలను మాత్రమే రద్దు చేసుకుని పాక్ పై ఒత్తిడిపెంచాలని భారత్ భావిస్తోంది.