
ఐఎస్‌కు మద్దతిస్తే వెలేయాలి
కొన్ని దేశాల విధానంలో ఉగ్రవాదం ఒక భాగం
జీ 20 సదస్సులో మోదీ
అంటాల్యా: కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. దాన్ని తమ రాజ్య విధానంలో భాగం చేసుకున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. టర్కీలోని అంటాల్యాలో జీ 20 సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మతాన్ని, ఉగ్రవాదాన్ని వేరు చేయాలని, రాజకీయ లక్ష్యాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరు సాగించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ‘ఉగ్రవాదాన్ని సమర్థించే, ఉగ్రవాదులకు సాయం చేసే వారిని వెలివేయాలి. ఉగ్రవాద సంబంధ సమస్యలను ఎదుర్కొనే దిశగా అంతర్జాతీయ వ్యవస్థను రూపొందించాల్సి ఉంది’ అన్నారు. ఆదివారం రాత్రి జరిగిన జీ 20 దేశాధినేతల వర్కింగ్ డిన్నర్‌లో ‘ప్రపంచం ముందున్న సవాళ్లు- ఉగ్రవాదం, వలస సమస్య’ అనే అంశంపై మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరుకు సమగ్ర తీర్మానాన్ని సాధ్యమైనంత త్వరగా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధుల సరఫరాను నిలిపివేసేందుకు, వారి కదలికలపై నిఘా వేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలన్నారు.
బ్లాక్‌మనీకి వ్యతిరేకంగా త్వరలో చట్టం
నల్లధనాన్ని నిరోధించే లక్ష్యంతో నిధుల సేకరణకు సంబంధించి త్వరలో నూతన చట్టాన్ని తీసుకురానున్నట్లు మోదీ వెల్లడించారు. జీ 20 సదస్సులో మాట్లాడుతూ.. బ్యాంకులు పాటిస్తున్న గోప్యతా నిబంధనలను ఎత్తివేయాలని, పన్ను సమాచార మార్పిడికి సంబంధించి ఉమ్మడి ప్రమాణాలను అనుసరించాలని డిమాండ్ చేశారు.
ద్వైపాక్షిక చర్చలు..
జీ 20 సదస్సు సందర్భంగా మోదీ.. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్, సౌదీ అరేబియా రాజు సల్మాన్, స్పెయిన్ ప్రధాని రజోయ్, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ తదితరులతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే మోదీ అమెరికా అధ్యక్షుడు ఒబామాతో మాత్రం సమావేశం కాలేదు. సోమవారం ఆయన స్వదేశానికి పయనమయ్యారు.
అవినీతి నిరోధానికి అన్ని చర్యలూ: జీ 20
అసమానతలతో కూడిన ఆర్థికవృద్ధి సమస్య పరిష్కారానికి అన్ని విధాన పరమైన చర్యలూ తీసుకుంటామని జీ-20 దేశాలు ప్రతినబూనాయి. ఐఎంఎఫ్‌లో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేసిన భారత్‌కు మద్దతు పలికాయి. పారిస్‌లో జరిగే ఐరాస సదస్సులో వాతావరణ మార్పుల నిరోధానికి పటిష్ట ఒప్పందం చేసుకోవాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. చర్చోపచర్చల తర్వాత ఓ ముసాయిదాను రూపొందించాయి.