బగ్గింగ్ భయంతో ఒబామా.. యాదృచ్ఛికంగా మోదీ!
లొకేషన్: ది వాల్డార్ఫ్ అస్టోరియా ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్, 301 పార్క్ అవెన్యూ, మాన్హట్టన్, న్యూయార్క్ సిటీ
అకేషన్: ఐక్యరాజ్యసమితి 70వ వార్షిక సమావేశానికి హాజరుకానున్న దేశాధినేతలకు విడిది ఏర్పాటయింది ఆ హోటల్ లోనే. గడిచిన కొన్ని దశాబ్దాలుగా అది సంప్రదాయంగా కొనసాగుతుంది.
అడ్మిరేషన్: చాన్నాళ్లు కాల్పులతో, అప్పుడప్పుడూ నోటితో మాట్లాడుకునే భారత్- పాకిస్థాన్ దేశాధినేతలు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ ఒకే చోట బసచేస్తున్నారు. ద్వైపాక్షిక చర్చలు లేనప్పటికీ రెండు కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటారు. ఇటీవలే ఎన్ఎస్ఏ స్థాయి చర్చలు రద్దయిన నేపథ్యంలో ఈ ఇద్దరూ ఎదురుపడితే.. సహజంగానే పలకరించుకుని ఆలింగనాలు చేసుకుంటారా? లేదా..
సెన్సేషన్: తరతరాల సాంప్రదాయానికి బరాక్ ఒబామా మంగళం పాడారు. ఏటా సెప్టెంబర్ లో జరిగే ఐరాస సాధారణ సమావేశాల్లో పాల్గొనేందుకు భార్యాపిల్లలు, అధికారగణంతో పాటు వాల్డార్ఫ్ అస్టోరియాలో దిగిపోవటం అమెరికా అధ్యక్షుల ఆనవాయితీ. ఇప్పుడు మాత్రం ఆ హోటల్ లో బస చేసేందుకు ససేమిరా అంటున్నారు ఒబామా!
అప్రెహెన్షన్: ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ద్వారా 2014లో వాల్డర్ఫ్ అస్టోరియా హోటల్ ను చైనాకు చెందిన ఓ కంపెనీ కొనుగోలు చేసింది. గతంలో ఒకసారి అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ నుంచి దేశ రక్షణ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని చైనా సైబర్ నేరగాళ్లు తస్కరించారు. ఈ రెండు చర్యల్నీ బేరీజు వేసుకుంటే.. తమ ఆధీనంలోలేని హోటల్ లో ఏ మూలలో ఏ నిఘా ఉంటుందో.. అక్కడ మాట్లాడేవి ఎక్కడెక్కడి వినిపిస్తాయోనన్న సందేహంతో ఏకంగా ఆ హోటల్ లో ఉండొద్దనే నిర్ణయానికి వచ్చారు ఒబామా.
కంటిన్యూషన్: ఇలా అనూహ్య పరిణామాల నడుమ సెప్టెంబర్ 25 నుంచి ఐరాస సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. తొలిసారి అమెరికాకు వచ్చిన పోప్ ఫ్రాన్సిస్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేరోజు అడాప్షన్ ఆఫ్ ది పోస్ట్- 2015 డెవలప్ మెంట్ సమ్మిట్ జరగనుంది. సెప్టెంబర్ 6 వరకు సమావేశాలు కొనసాగుతాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 23 ఉదయం ఐర్లాండ్ చేరుకుంటారు. చర్చల అనంతరం అదేరోజు రాత్రి అమెరికాకు బయలుదేరుతారు. మొత్తానికి నరేంద్ర మోదీ న్యూయార్క్ నగరంలోని వాల్డార్ఫ్ అస్టోరియా హోటల్ కు బుధవారమే చేరుకుంటారని విదేశాంగ శాఖ పేర్కొంది. రెండు రోజుల తర్వాత అంటే శుక్రవారం (25న) ఇస్లామాబాద్ నుంచి వచ్చే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. అదే హోటల్ లో దిగుతారు.
డెవలప్మెంట్ సమిట్ (శుక్రవారం 25)లో ఒకసారి, శాంతి పరిరక్షణపై ఏర్పాటయిన సమావేశం (సోమవారం, 28)లో మరోసారి మోదీ, షరీఫ్ లు కలిసి పాల్గొంటారు. అధికారికంగా కలుసుకునే అవకాశాలేవీ లేవు. ఒకే హోటల్లో ఉంటున్నారు కాబట్టి ఏదోఒక సందర్భంలోనైనా వీరిద్దరూ ఎదురు పడకపోరా.. అప్పుడు ఎలా స్పందిస్తారు.. పలకరించుకుంటారా.. చిర్రుబుర్రులాడతారా.. అనే సందేహాలు అమెరికా మీడియాలొ చక్కర్లు కొడుతున్నాయి. పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తార్ అజీజ్ మాత్రం 'భారత్ చర్చలకు సిద్ధమైతే మేమూ సిద్ధమే' అని ప్రకటించేశారు. ఏం జరుగుతుందో చూడాలి..