అది నా దురదృష్టం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: చక్రవర్తులు, రాజులు, పాలకులు, ప్రభుత్వాలతో ఒక దేశాన్ని నిర్మించలేమని.. పౌరులు, యువత, రైతులు, మేధావులు, శ్రామికులతోనే మాత్రమే జాతి నిర్మితం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
తమ కుటుంబాలలోకానీ, సమాజంలోకానీ చోటుచేసుకునే మంచి మార్పులకు ఉత్ప్రేరకాలుగా నిలిచేవారే ఎన్‌సీసీ క్యాడెట్లని కితాబిచ్చారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో శనివారం జరిగిన నేషనల్ క్యాడెట్ కోర్స్(ఎన్‌సీసీ) వార్షిక కవాతుకు ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొని క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. ‘ఏటా ఢిల్లీలో నిర్వహించే ఎన్‌సీసీ క్యాడెట్స్ వార్షిక కవాతులో పాల్గొనడాన్ని విద్యార్థులు ఎంతో గర్వంగా బావిస్తారు. కానీ నాకు ఆ అవకాశం దక్కలేదు. అది నా దురదృష్టం. మిమ్మల్ని చూస్తుంటే భావి భారతంపై నాకు నమ్మకం రెట్టిపవుతోంది. యువశక్తి దేశానికి గర్వకారణం’ అని మోదీ అన్నారు.
తమ ప్రభుత్వం ప్రారంభించిన నగదు రహిత చెల్లింపుల విధానాలపై అవగాహన కల్పించేందుకు ఎన్‌సీసీ క్యాడెట్లు సంకల్పించడం సంతోషం కలిగించిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను స్మరించుకుంటూ ‘భీమ్ యాప్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, తద్వారా దేశ ఉన్నతికి తోడ్పడాలని ప్రధాని పిలుపునిచ్చారు.