
కేరళలో ప్రధానికి ఉగ్ర ముప్పు!
కొచ్చి: కేరళలో కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటించిన సమయంలో ఉగ్రవాదుల నుంచి ముప్పు ఎదుర్కొన్నారని ఆ రాష్ట్ర డీజీపీ టీపీ సేన్‌కుమార్ చెప్పారు. ఆ సమయంలో ఓ ఉగ్ర సంస్థ అక్కడ క్రియాశీలకంగా ఉందని, ఇంతకుమించి వివరాలను వెల్లడించడం సాధ్యం కాదన్నారు.
కొచ్చిలో ఎల్‌పీజీ టెర్మినల్‌ను వ్యతిరేకిస్తున్న వారిపై శుక్రవారం హైకోర్టు సమీపంలో పోలీసుల చర్యను సమర్థిస్తూ సేన్‌కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. మోదీ కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎస్‌పీజీ ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా నిరసనకారులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని చెప్పారు. నిరసనకారులు అనూహ్యంగా దూసుకొచ్చారని, వారిని అదుపు చేయడానికి లాఠిచార్జి చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఆందోళన వెనుక తీవ్రవాద సంస్థల హస్తముందని స్పష్టం చేశారు.
పోలీసులు జరిపిన లాఠిచార్జిలో కనీసం 20 మంది గాయపడ్డారు. లాఠిచార్జికి కొచ్చి నగర పోలీసు కమిషనర్ యతిశ్ చంద్ర ఆదేశాలిచ్చారని వచ్చిన ఆరోపణలను డీజీపీ తోసిపుచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రధాని మోదీ శనివారం కొచ్చిలో పర్యటించారు. కొచ్చి మెట్రో మొదటి దశను జాతికి అంకితం చేశారు.