
డబ్లిన్లో ఐర్లాండ్ ప్రధాని నుంచి హర్లింగ్ బ్యాట్, బాల్ స్వీకరిస్తున్న ప్రధాని మోదీ
మండలిలో శాశ్వత స్థానానికి మద్దతివ్వండి.. ఐర్లాండ్ ప్రధానిని కోరిన మోదీ
డబ్లిన్: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో, అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ) సహా అంతర్జాతీయ ఎగుమతుల సంస్థల్లో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతునివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐర్లాండ్‌ను కోరారు. అమెరికా పర్యటనకు వెళ్లేముందు బుధవారం ఆ దేశంలో పర్యటించిన మోదీ డబ్లిన్లో ఐర్లాండ్ ప్రధాని ఎన్డాకెన్నీతో చర్చలు జరిపారు.
ఉగ్రవాదం, యూరప్, ఆసియాల్లో పరిస్థితి సహా పలు అంశాలపై తాము మాట్లాడామని అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ పేర్కొన్నారు. ప్రపంచ, ప్రాంతీయ అనిశ్చితులు, ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఐర్లాండ్ వీసా విధానం భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల అవసరాల పట్ల మృదువుగా ఉంటుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
త్వరలో ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఉంటాయన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, డబ్ల్యు.బి.యీట్స్‌ల మధ్య స్నేహం మొదలుకొని.. భారత్‌లో సిస్టర్ నివేదిత ఆధ్యాత్మిక సేవ వరకూ ఐరిష్ - భారత ప్రజల మధ్య బలమైన సంబంధాలు నెలకొన్నాయని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు ఐరిష్ ప్రజల్లో 26,000 మంది భారతీయులు భాగంగా ఉన్నారని చెప్పారు. 1985లో పేల్చివేతకు గురైన ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాధితులు ఇక్కడే శాశ్వత విశ్రాంతి తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఐర్లాండ్ ప్రధానికి మోదీ కానుకలు
బ్రిటిష్ పాలన నాటి ఇద్దరు ఐర్లండ్ అధికారులు థామస్ ఓల్ధామ్, జార్జ్ అబ్రహామ్ గ్రీర్సన్‌లకు సంబంధించి పలు చారిత్రక పత్రాల నమూనాలను నరేంద్రమోదీ బుధవారం ఐర్లాండ్ ప్రధాని ఎన్డాకెన్నీకి కానుకగా బహూకరించారు. డబ్లిన్‌లో జన్మించిన ఓల్ధామ్ 1850లో భారత్‌లో భౌగోళిక సర్వేయర్‌గా నియమితులయ్యారు. ఆయన విధుల్లో చేరిన రోజును భారత్‌లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వ్యవస్థాపనా దినోత్సవంగా పాటిస్తున్నారు.
భారత్‌లో బొగ్గు, ఇతర ఖనిజ గనులపై సర్వే చేయటంతో పాటు.. ఇక్కడి శిలాజాల గురించీ ఆయన విస్తృతంగా అధ్యయనం చేశారు.ఇక గ్రీర్సన్ 1889 మొదలుకొని భారత్‌లో తొలి భాషా ప్రాతిపదిక సర్వే నిర్వహించారు. వీరు రూపొందించిన పత్రాలను ప్రస్తుతం నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో భద్రంచేసి ఉంచారు. ఈ పత్రాల నమూనాలతో పాటు.. ప్రత్యేకంగా చేతితో తయారు చేసిన వెండి, చలువరాయిలతో కూడిన కొవ్వొత్తి స్టాండు ను కూడా ఎన్డాకు మోదీ కానుకగా అందించారు.
ఐరిష్ చిన్నారులు చెబుతున్న సంస్కృత శ్లోకాలను వింటున్న మోదీ
ఇదే ఇండియాలో జరిగితే ప్రశ్నలు తలెత్తేవి
డబ్లిన్‌లో భారతీయుల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీకి ఐరిష్ చిన్నారులు సంస్కృత శ్లోకాలతో స్వాగతం చెప్పారు. దీనిపై ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘‘ఇదే ఇండియాలో జరిగితే దీనిపై ప్రశ్నలు లేవనెత్తేవారు’’ అంటూ దేశంలోని లౌకికవాదులపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. సంస్కృత శ్లోకాలలోని సందేశాన్ని చిన్నారులు అవగతం చేసుకున్న తీరు తనకు ముచ్చటగొలుపుతోందని పేర్కొన్నారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యున్నత దేశాల్లో భారత్ ఉందని.. ప్రపంచమంతా ఇండియా గురించే మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత అభివృద్ధి వేగాన్ని కొనసాగించగలిగితే వచ్చే 30 ఏళ్లలో దేశంలో పేదరికం ఆనవాళ్లు కూడా కనిపించవన్నారు. భారత జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల వయసు లోపు వారేనంటూ.. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే నిజమైన ఆస్తులు వారేనని అభివర్ణించారు.