
దుర్గ కిడ్నాప్.. సుఖాంతం
నల్లగొండలో నిందితురాలి జాడ
పాపను క్షేమంగా విడిపించిన రైల్వే పోలీసులు
అదుపులో నిందితురాలు.. మరో ఇద్దరు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వారం రోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి దుర్గ కేసు సుఖాంతమైంది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ కేసును ఛేదించిన రైల్వే పోలీసులు నిందితురాలితోపాటు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను నల్లగొండలో అదుపులోకి తీసుకున్నారు. కాకినాడకు చెందిన జి. రాణి తన కుమార్తె దుర్గ(5)తో కలసి పదిరోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న సోదరుని ఇంటికి వచ్చింది. తిరిగి వెళ్లేందుకు ఈనెల 5న చిన్నారితో కలసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్‌లో వేచిచూస్తున్న రాణితో ఓ మహిళ మాటకలిపి పరిచయం చేసుకుంది. తనదీ విజయవాడేనని నమ్మించింది. రైలు వచ్చేందుకు చాలా సమయం ఉందని స్టేషన్ బయట పండ్లు కొందామని చెప్పి బయటకు తీసుకువచ్చింది. తిరిగి స్టేషన్‌లోకి వెళ్లే క్రమంలో ముందు రాణి నడుస్తుండగా, వెనుక దుర్గను ఎత్తుకుని మహిళ అనుసరించింది.
టికెట్ కౌంటర్ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో చిన్నారితో మహిళ అక్కడి నుంచి ఉడాయించింది. చుట్టపక్కల వెతికి.. చివరకు తన కుమార్తె కిడ్నాప్‌కు గురైనట్లు గ్రహించిన రాణి.. జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా చిన్నారిని అపహరించిన మహిళను గుర్తించారు. ఆమె చిన్నారితో సహా నల్లగొండ వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించి.. ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. నల్లగొండ పట్టణంలో నిందితురాలితోపాటు ఆమెకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, చిన్నారి దుర్గను సురక్షితంగా విడిపించారు. గురువారం హైదరాబాద్‌కు తీసుకుచ్చిన నిందితులను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చిన్నారి దుర్గ కిడ్నాప్‌ను విజయవంతంగా ఛేదించి, నిందితులను అదుపులోకి తీసుకున్నామని జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు.