ప్రమాదాలకు తావులేకుండా డ్రైవర్లెస్ కార్లు, డ్రైవర్లెస్ బస్సులు ఇలా డ్రైవర్తో సంబంధం లేని పూర్తిగా టెక్నాలజీతో నడిచే సేవలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. పలు వాహన కంపెనీలు సైతం ఈ కొత్త తరం డ్రైవర్ లెస్ వాహనాలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. వీటిని రోడ్లపైకి విజయవంతంగా తీసుకురావడానికి టెక్నాలజీ కంపెనీలతోనూ జతకడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్తరకం డ్రైవర్లెస్ వాహనం మన ముంగింట్లోకి రాబోతుంది. అదేమిటంటే డ్రైవర్లెస్ పోలీసు సూపర్ బైక్.. సూపర్ ఫాస్ట్గా పేరొందనున్న ఈ వాహనం 24/7 సమయాలో జాతీయరహదారులపై చక్కర్లు కొడుతూ.. స్పీడ్ లిమిట్ను క్రాస్ చేసిన వాహనదారులకు చెక్ పెట్టేలా ఇది రూపొందుతోంది. ఇంటర్సెప్టర్ డ్రోన్ పోలీసు 01 పేరుతో ఇది మార్కెట్లోకి రానుంది.
అయితే ఈ బైక్ను ఏ కంపెనీ రూపొందిస్తోందో తెలుసా? తర్వాతి తరం వాహనాలు రూపొందించడమే తమ డ్రీమ్గా సేవలందిస్తున్న లాభాపేక్ష లేని బొంబార్డియర్ దీన్ని ప్రవేశపెట్టబోతోంది. ఇది టెక్నాలజీలో ఓ సహజ పరిణామమని కెనడియన్ మెకానికల్ ఇంజనీర్ చార్లెస్ బొంబార్డియర్ పేర్కొన్నారు. నేటి ఉత్పత్తులకు కొత్తరకం ఆలోచనలతో ముందుకు రావడమే తమ లక్ష్యమని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు ఎన్నో రోజులుగా ట్రాఫిక్ కెమెరాలు వాడుకలో ఉన్నాయని, కానీ పబ్లిక్ వర్క్ సిస్టమ్స్లో కనీస అవసరాలకు కొత్తగా మెరుగైన పరిష్కారాలు తీసుకురావాలని ఆయన చెప్పారు.
ఈ సూపర్ బైక్ పెట్రోలింగ్ చేసేటప్పుడు లైసెన్స్ ప్లేట్లను స్కాన్ చేయడం, రియల్ టైమ్ వీడియో ఉపయోగించి నేరాలు రికార్డు చేయడం వంటివి చేయనుంది. ఒకవేళ ఉల్లఘనలు రికార్డు అయితే, డ్రోన్ ఆటోమేటిక్గా వారికి నోటీసులు జారీచేయనుంది. హైడ్రోజన్ లాంటి కర్బన్ రహిత ఉద్గారాల ద్వారా ఇది రూపొందుతోంది.