పన్ను నియంత్రణపై జీఎస్టీలో ప్రతిష్టంభన
ఏ పన్ను ఎవరి నియంత్రణలో ఉండాలన్న దానిపై విభేదాలు
కేంద్ర, రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్‌ల తాజా వివరాలకు రాష్ట్రాల పట్టు
నవంబర్ 24, 25 తేదీల్లో తదుపరి సమావేశం
న్యూఢిల్లీ: వస్తు,సేవల పన్ను(జీఎస్టీ)లో ఏయో పన్ను చెల్లింపుదారులపై ఎవరికి నియంత్రణ ఉండాలన్న అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో సభ్యుల మధ్య అంగీకారం కుదరలేదు. పన్ను రేట్లకు గురువారం నాటి భేటీలో కౌన్సిల్ ఏకగీవ్రంగా ఆమోదం తెలపగా... పన్ను నియంత్రణపై విభేదాలతో త్వరితగతిన జీఎస్టీ అమలుకు అడ్డంకులేర్పడ్డాయి. దీంతో ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలు సాధ్యం కాకపోవచ్చునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ తరగతి పన్ను చెల్లింపుదారులు కేంద్రం పరిధిలో ఉండాలి? ఏ తరగతి పన్నులు రాష్ట్రాల నియంత్రణలో ఉండాలి? అన్నదానిపై కేంద్ర, రాష్ట్రాలు చెరోవాదన వినిపించాయి.
సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్ చెల్లింపుదారులకు సంబంధించి తాజా వివరాలు అందుబాటులో లేకపోవడంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఏకాభిప్రాయం రాకపోవడంతో నవంబర్ 9, 10 న జరగాల్సిన కౌన్సిల్ తదుపరి భేటీని రద్దు చేశారు. ఆ భేటీలో జీఎస్టీ ముసాయిదా చట్టంతో పాటు, ఇతర సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాల్ని ఖరారు చేయాల్సి ఉంది. ప్రతిష్టంభనకు తెరదించేందుకు నవంబర్ 20న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశమై... ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తారు. నవంబర్ 19న కూడా సమావేశమవుతాయని రాష్ట్రాల మంత్రులు తెలిపారు.
వచ్చే భేటీలో డ్రాఫ్ట్ చట్టాలకు ఆమోదం
తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నవంబర్ 24, 25 తేదీల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన నిర్వహిస్తారు. ఆ భేటీలో పన్నులపై ద్వంద్వ నియంత్రణకు పరిష్కారంతో పాటు, ఏ పన్ను చెల్లింపుదారులు ఎవరి పరిధిలో ఉండాలన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఐజీఎస్టీ(ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ), సీజీఎస్టీ(సెంట్రల్ జీఎస్టీ), ఎస్టీఎస్టీ(స్టేట్ జీఎస్టీ) ముసాయిదా చట్టాల్ని ఆమోదిస్తారు. భేటీకి ముందు జైట్లీ ఆశాభావం వ్యక్తం చేస్తూ... జీఎస్టీకి సంబంధించిన అన్ని విధివిధానాలు నవంబర్ 22లోపు పూర్తవుతాయని చెప్పారు. నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే పార్ల్లమెంటు శీతాకాల భేటీలో సంబంధిత చట్టాలు ఆమోదం పొందుతాయన్నారు.
హడావుడి నిర్ణయాలు వద్దు: రాష్ట్రాలు
పన్నులపై ద్వంద్వ నియంత్రణ. ఇతర ఇబ్బం దులుంటే జీఎస్టీ అమలు ఆలస్యం అయ్యే అవకాశముందని సమావేశంలో పాల్గొన్న ఒక మంత్రి వెల్లడించారు. హడావుడిగా నిర్ణయం తీసుకోవాలని తాము కోరుకోవడం లేదని, సమాచారం మొత్తం అందాకే పన్నుల నియంత్రణపై తుది నిర్ణయం తీసుకుం టామని చెప్పారు. సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్‌పై తాజా వివరాలు అందుబాటులో లేవని, వాటి అందచేయాలంటూ కేంద్రాన్ని కోరామని మరో మంత్రి పేర్కొన్నారు. రూ. 1.5 కోట్ల కంటే తక్కువ సేవా పన్ను చెల్లింపులపై రాష్ట్రాలకు కూడా అధికారం ఉండాలని కోరారు.
సర్వీస్ ట్యాక్స్ ఖాతాలపై విభేదాలు
పన్నులపై ద్వంద్వ(కేంద్ర, రాష్ట్రాలు) నియంత్రణ సమస్య నివారిస్తూ... వేటిపై ఎవరికి అధికారం ఇవ్వాలన్న అంశంపై కొద్ది నెలలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. 11 లక్షల సర్వీస్ ట్యాక్స్ ఖాతాలపై తమ నియంత్రణ ఉండాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండగా... కేంద్ర ప్రభుత్వం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వార్షిక ఆదాయం రూ. 1.5 కోట్ల వరకూ ఉండే పన్ను ఖాతాల నియంత్రణ నుంచి రాష్ట్రాలు తప్పుకోవాలనేది కేంద్రం వాదన. ఈ విషయంపై జీఎస్టీ కౌన్సిల్ మొదటి సమావేశంలో అంగీకారం కుదిరినా... అక్టోబర్ 19న నిర్వహించిన మూడో సమావేశంలో మాత్రం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.