
సింగపూర్: మూడు కీలక సంస్కరణలైన ఆధార్ అనుసంధానం, డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్ల వ్యవస్థలో పారదర్శకత, పాలనలో సమర్థత పెరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి తక్కువ నగదు కలిగిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఈ సంస్కరణలు సాయపడ్డాయన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఇన్వెస్టర్లతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక రంగానికి ప్రేరణనిచ్చేందుకు భారత సర్కారు వరుస సంస్కరణలు అమలు చేసిందని చెప్పారు. జూలై 1 నుంచి ప్రవేశపెట్టిన జీఎస్టీతోపాటు బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ), బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ అంశాలను జైట్లీ ప్రస్తావించారు.
రీక్యాపిటలైజేషన్‌తో రెండు రకాల బ్యాలన్స్ షీట్ల సమస్యకు తెరపడుతుందని, ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లధన నియంత్రణకు గాను గతేడాది తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, ఆ తర్వాత దానికి కొనసాగింపుగా తీసుకున్న చర్యలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాల్లో మార్పులు అన్నీ భారత్‌ను మరింత స్వేచ్ఛాయుత, పెట్టుబడిదారీ స్నేహపూర్వక దేశంగా చేయాలన్న లక్ష్యంతోనేనని జైట్లీ వివరించారు. కేంద్ర సర్కారు గత మూడేళ్ల కాలంలో తీసుకున్న అనేక చర్యల ఫలితంగానే ప్రపంచ బ్యాంకు వ్యాపార సులభతర దేశాల సూచీలో భారత్ 142వ స్థానం నుంచి 100వ స్థానానికి చేరుకుందన్నారు. కాగా, రెండు రోజుల పర్యటనకు గాను సింగపూర్ వచ్చిన జైట్లీ సింగపూర్ సావరీన్ వెల్త్ ఫండ్ సీఈవో, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై చర్చలు జరిపారు. భారత్‌లో పలు రంగాల్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు.