
ఇఖ్లాక్ హత్యపై రాజకీయాలు
♦ పార్టీల పరస్పర ఆరోపణలు
♦ కుటుంబానికి సీఎం పరామర్శ
దాద్రి/లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ తహశీల్ బిషాదా గ్రామంలో గోమాంసం తిన్నారన్న అనుమానంపై ఇఖ్లాక్ అనే వ్యక్తిని స్థానికులు కొట్టిచంపడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. పార్టీల నేతలు ఈ గ్రామానికొచ్చి పరస్పర విమర్శలకు దిగుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆదివారం యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్.. ఇఖ్లాక్ కుటుంబాన్ని లక్నోలో పరామర్శించారు. ఈ కుటుంబానికి పరిహారాన్ని రూ.45 లక్షలకు పెంచారు. వారికి పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. దాద్రీలో పర్యటించిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్.. గోహత్యకు పాల్పడినవారిని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం కాపాడుతోందని ధ్వజమెత్తారు.
ఈ ఘటనకు సీఎం మతంరంగు పులుముతున్నారన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీని బిషాదాలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆయనతో కుమ్మక్కయిందా? అని నిలదీశారు. ఇఖ్లాక్ హత్యకేసులో పోలీసులు ఆదివారం ఒక హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క... ఇఖ్లాక్ హత్య దురదృష్టకమరని, దీనికి మతం రంగు పులమొద్దని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.