ఔను.. అందుకే ఓడిపోయాం: కెప్టెన్ కోహ్లి
వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఓటమికి బ్యాట్స్‌మెన్ వైఫల్యమే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అంగీకరించాడు. చెత్త షాట్ సెలక్షన్ వల్లే వెస్టిండీస్ చేతిలో 11 పరుగులతో తేడాతో పరాభవాన్ని ఎదుర్కొన్నట్టు చెప్పాడు. 190 పరుగుల కనీస లక్ష్యాన్ని భారత్ నిలబెట్టుకోకపోవడం ఇటీవలికాలంలో అత్యంత అరుదనే చెప్పాలి. ఈ ఓటమిపై మ్యాచ్ తర్వాత కోహ్లి స్పందిస్తూ 'మా షాట్ సెలక్షన్ స్థాయికి తగినట్టు లేదు. కీలక దశలో కీలక వికెట్లు కోల్పోయాం. మ్యాచ్ అంతటా పట్టు నిలబెట్టుకోలేకపోయాం' అని కోహ్లి అన్నాడు.
భారత్‌తో తాజా ఐదు వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ ఇప్పటివరకు 200 మార్కును దాటలేకపోయింది. అదే ధోరణిని కొనసాగిస్తూ మూడో వన్డేలోనూ ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్లకు 189 పరుగులు చేసింది. అయితే, వెస్టిండీస్ బౌలర్లు అల్జారీ జోసెఫ్, కేస్రిక్ విలియమ్స్, దేవేంద్ర బిషూ, ఆష్లే నర్స్ అద్భుతంగా రాణించి క్రమం తప్పకుండా భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీయడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. 'మా బౌలర్లు చాలా బాగా ఆడారు. కానీ క్రెడిట్ వెస్టిండీస్ బౌలర్లదే. మా బౌలర్లు, ఫీల్డర్లు బాగా కృషిచేసినప్పటికీ బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ గేమ్‌ను కోల్పోయాం' అని కోహ్లి చెప్పుకొచ్చాడు.
చదవండి: ధోనీ కెరీర్‌లో ఇదే తొలిసారి.. అయినా ప్చ్!
చదవండి: ఉత్కంఠ పోరులో విండీస్ విజయం