
రండి.. చేరండి: భారత్‌లో ఐసిస్ కలకలం!
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్)లో చేరాలని యువతను ఆహ్వానిస్తూ పోస్టర్లు వెలువడం కలకలం రేపింది.
సహస్ర (బిహార్): అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్)లో చేరాలని బిహార్ యువతను ఆహ్వానిస్తూ పోస్టర్లు వెలువడం కలకలం రేపింది. బిహార్ సహస్రా జిల్లాలోని నౌహట్టా ప్రాంతంలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ముఖాలకు మాస్క్ పెట్టుకున్న ఐసిస్ ఉగ్రవాదుల ఫొటోలు ఈ పోస్టర్లలో ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నౌహట్టాలోని కరెంటు స్తంభాలకు దాదాపు అంటించిన దాదాపు మూడు పోస్టర్లను పోలీసులు గుర్తించారు.
బిహార్ యువతను ఆహ్వానిస్తూ ఇంగ్లిష్‌లో రాసి ఉన్న ఈ పోస్టర్లలో ఐసిస్ పేరు, జెండా కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భద్రతపరమైన అలర్ట్ జారీచేశామని, పోస్టర్లు ఎవరు అంటించారనే దానిపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ పోస్టర్ల గురించి స్థానిక గ్రామస్తులు సమాచారం ఇచ్చారని, వీటిని తాము స్వాధీనం చేసుకున్నామని, కరుడుగట్టిన నేరగాళ్ల హస్తం ఈ పోస్టర్ల వెనుక ఉన్నట్టు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లక్నోలో ఇద్దరు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.