
రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాకే : అభిషేక్ సింఘ్వీ
రాష్ట్రపతి పాలనపై అభిషేక్ సింఘ్వీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆచితూచి స్పందించారు. ఏఐసీసీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఏపీలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? లేక తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరుగా సీఎంలను నియమిస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ ‘‘ఇలాంటి నిర్ణయాన్ని ప్రెస్ కాన్ఫరెన్సులో తీసుకోలేం. ప్రస్తుతం రాజ్యసభలో టీ బిల్లు పాస్ కావాల్సి ఉంది.
రాష్ట్రపతి పాలన విధించే అంశంపై కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్రపతి చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో రాజ్యాంగం ప్రకారమే వ్యవహరిస్తారు. ఇతర రాష్ట్రాల్లో సంక్షోభం తలెత్తినప్పుడు పాలనాపరంగా ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు ఏ విధంగా వ్యవహరించారో ఏపీలోనూ అలాగే చర్యలు తీసుకుంటారు’’ అని చెప్పారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు అంశంపై మాట్లాడేందుకు నిరాకరించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న పార్టీలతో పొత్తుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు.