
ఘోర ప్రమాదం: 8 మంది చిన్నారుల మృతి
కర్ణాటకలో ఘోర ప్రమాదం సంభవించింది. ఉడిపి జిల్లాలోని మొహాడీ క్రాస్ వద్ద స్కూలు వ్యానును బస్సు ఢీకొనడంతో 8 మంది పిల్లలు మరణించారు. వ్యాన్ డ్రైవర్, ఒక టీచర్ సహా మరో 12 మంది గాయపడ్డారు. బైండూరు నుంచి కుందాపూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సు... పిల్లలను డాన్ బాస్కో స్కూలుకు తీసుకెళ్తున్న మారుతి ఓమ్ని వ్యానును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో ప్రాణాలు కోల్పోయారు. మరో పిల్లవాడు ఆస్పత్రిలో మరణించాడు.
గాయపడినవాళ్లలో కొందరికి స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా మిగిలినవారిని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. మరణించిన ఎనిమిది మందిలో ఆరుగురు అమ్మాయిలు కాగా, ఇద్దరు బాలురు ఉన్నారు. వారిలో నలుగురిని నిఖిత, కెల్సిటా, అనన్య, అన్సితలుగా గుర్తించారు. జిల్లా ఎస్పీ అన్నమలై ఆస్పత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బస్సులోని కొందరు ప్రయాణికులకు కూడా కొద్దిపాటి గాయాలయ్యాయి. దీనిపై గంగొల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.