అవినీతి నిరోధంపై దృష్టి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి రహిత వ్యవస్థ కోసం కృషి చేస్తానని నూతన కేంద్ర విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ చౌదరి స్పష్టం చేశారు. అవినీతి జరగకుండా ముందుగానే నిరోధించడంపై దృష్టిని కేంద్రీకరిస్తామన్నారు. అవినీతి కేసులను వేగంగా పరిష్కరించడంతో పాటు అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే దిశగా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం చౌదరి చేత సీవీసీగా ప్రమాణం చేయించనున్నారు. ఈ సందర్భంగా కేవీ చౌదరి
‘సాక్షి’కిచ్చిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..
ప్ర: సీవీసీ బలోపేతానికి తీసుకునే చర్యలేంటి?
జ: అవినీతి జరగకుండా ముందుగానే నిరోధించడానికి నిఘా విస్తృతం చేస్తాం. తనిఖీలు నిర్వహిస్తాం. ఫిర్యాదులను త్వరితగతంగా విచారిస్తాం. ఈ కేసులను 10-15 ఏళ్లపాటు తేల్చకపోవడంతో నిర్దోషులు ఇబ్బందులు పడతారు. ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి 15 ఏళ్ల తర్వాత నిర్దోషి అని తేలితే ఆ అధికారికి తీరని నష్టం వాటిల్లుతుంది.
ప్రశ్న: సీవీసీ, ఇతర దర్యాప్తు సంస్థలు సమర్ధవంతంగా పనిచేయడం లేదనే విమర్శలపై?
జ: సమర్థంగా పనిచేయడం లేదని చెప్పలేం. భారత్‌ను అవినీతి వాస్తవమే. దాని కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల్లో చైతన్యం ముఖ్యం. ‘పని త్వరగా జరక్కపోయినా పర్లేదు. వేచి చూస్తా కానీ అవినీతిని ప్రోత్సహించన’నే దృక్పథం ప్రజల్లో రావాలి. పది రూపాయలిస్తే పని త్వరగా అవుతుందను కోవడం అవినీతిని ప్రోత్సహించడమే. అవినీతిపై సమాచారం ఇచ్చిన వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న: నల్లధనాన్ని తేవడంతో సీవీసీ పాత్ర ?
జ: నల్లధనం వెనక్కి తీసుకురావడంలో సీవీసీ పాత్ర తక్కువే. అవినీతి మార్గంలో ఆర్జించిన డబ్బులో ఓ 30% పన్నులు చెల్లించి నల్లధనాన్ని ‘వైట్’గా మారుస్తామంటే ప్రభుత్వం ఒప్పుకోదు.
ప్రశ్న: అత్యున్నత పదవిలో నియమితులవడంపై మీ అనుభూతి ఎలా ఉంది?
జ: అదృష్టంగా భావిస్తున్నా. ఓపెన్ కాంపిటేషన్‌లో పారదర్శకంగా ఎంపికవ్వడం ఆనందాన్నిస్తోంది. 130 దరఖాస్తులు వచ్చాయి. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. తల్లిదండ్రులు, గురువులు చెప్పిన విషయాలు ప్రభావితం చేశాయి. నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, దేశానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలనే లక్ష్యం, దాన్ని సాధించే దృఢ సంకల్పం.. నన్ను ఈ స్థాయికి చేర్చాయను కుంటున్నా.